ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానాన్ని కోల్పోయారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెడుతుందనే ఊహాగానాలతో.. ముకేశ్ అంబానీ అస్తులకు 5.8 బిలియన్ డాలర్ల మేరకు నష్టం వాటిల్లింది. ఈ కారణంగా ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయారు. ఈ జాబితాలో చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అలీ బాబా వ్యవస్థాపకుడు జాక్‌మా అగ్ర స్థానం దక్కిచుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం జాక్ మా సంపద విలువ 44.5 బిలియన డాలర్లుగా తెలిసింది. ఈ మొత్తం ముకేస్ అంబానీ సంపద కన్నా 2.60 బిలియన్ డాలర్లు ఎక్కువ.
సంపదకు చమురు దెబ్బ..
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం తగ్గింది. అంతే కాకుండా చమురు ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల్లో ఉత్పత్తి ధరల యుద్ధం దీనికి మరో కారణమైంది. దీంతో చమురు ధరలు 29 సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయాయి. చమురు ధరల ప్రభావం అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌పై పడింది. ఈ సంస్థ షేర్ల విలువ సోమవారం 12 శాతం వరకూ క్షీణించాయి. ఫలితంగా అంబానీ ఆస్తి దాదాపు 5 బిలియన్ డాలర్ల మేర తగ్గింది.
అలీబాబాపై కరోనా ప్రభావం పడినప్పటికీ క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ యాప్‌ల ద్వారా వాణిజ్యం పుంజుకోవటం వల్ల ఆ నష్టం భర్తీ అయింది. ఈ పరిణామాలతో జాక్‌మా ఆస్తులు వృద్ధి చెందాయి.
ఇదీ చూడండి:టీసీఎస్‌లో షేర్లు ఉన్నాయా? మీకో శుభవార్త!