భారత్‌లో అంబానీలు తెలియని వారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. రిలయన్స్ సంస్థతో ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేసింది అంబానీ కుటుంబం. ప్రస్తుతం సంపన్నుల జాబితాలో దేశంలో మొదటి స్థానం, ప్రపంచంలో 13వ స్థానంలో ఉన్నారు ముకేశ్ అంబానీ. దక్షిణ ముంబయిలోని ఆయన ఇల్లు 'ఆంటీలియా' ఖరీదు 27వేల కోట్లు. అందులో పనిచేసేందుకు 600 మంది సిబ్బందిని నియమించుకున్నారు. అందులో ప్రఖ్యాతి గాంచిన వంటగాళ్లు కూడా ఉన్నారు.
సరదాగా మాట్లాడుకుంటే.. అంబానీకి బయటికి వెళ్లి తినాలనిపిస్తే.. ఎక్కడికి వెళతారనే ఆసక్తి అందరిలో ఉంటుంది. తనకు ఇష్టమైన ఆహారం కోసం ఎంత ఖర్చు పెడతారు? ఏ ఆహారాన్ని ఇష్టంగా తింటారు? అనే ప్రశ్నలు రావటం సహజం.
అయితే, ముకేశ్ అంబానీకి ఇష్టమైన ఆహారం, రెస్టారెంట్ ఏమిటో తెలిస్తే ఆయన ఎంత సాదాసీదా అభిరుచి ఉన్న వ్యక్తో అర్థమవుతుంది. ముకేశ్‌కు అత్యంత ఇష్టమైన రెస్టారెంట్ ఎక్కడో లేదు.. మన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనే ఉంది. అంతేకాదు ఆ రెస్టారెంట్‌కు సాధారణ వ్యక్తి కూడా వెళ్లగలడు, కడుపునిండా తినగలడు..! అదే ముంబయి కింగ్స్ సర్కిల్లోని 'కేఫ్ మైసూర్ రెస్టారెంట్'
ఈ రెస్టారెంట్లో లభించేవన్నీ దక్షిణాది వంటకాలే. 1930లో రామనాయక్ అనే వ్యక్తి కేఫ్ మైసూర్‌ను స్థాపించాడు. మొదట్లో కింగ్స్ సర్కిల్ రైల్వేస్టేషన్ వద్ద బండిపై దోశలు వేసేవాడు రామనాయక్. ఆ తర్వాత అతని వంటల రుచి ముంబయిలో ప్రాచుర్యం పొందగానే.. మాతుంగాలో దక్షిణాది వంటకాల రెస్టారెంట్ ప్రారంభించాడు.
వీటితో పాటు మరో మూడు బ్రాంచులను పెట్టి ఒక్కోదాన్ని తన నలుగురు కొడుకులకు పంచాడు. అవే.. 'ఉడుపి కృష్ణా భవన్', 'కేఫ్ మైసూర్', 'ఉడుపి కేఫ్', 'ఇడ్లీ హౌస్'. వీటిలో కింగ్స్ సర్కిల్ వద్ద ఉన్నది కేఫ్ మైసూర్.
'కేఫ్'తో ముకేశ్ ఎలా కనెక్ట్ అయ్యారు?
ముకేశ్ అంబానీ కెమికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడు. యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (యూడీసీటీ)లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. దాదాపు 83 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ యూనివర్సిటీ పేరు.. ప్రస్తుతం 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ'గా రూపాంతరం చెందింది. కేఫ్ మైసూర్ కూడా ఈ విశ్వవిద్యాలయానికి సమీపంలోనే ఉంటుంది. అందుకే తన కాలేజీ ఎదురుగా ఉన్న కేఫ్ మైసూర్ రెస్టారెంట్లోనే తరచూ తినేవారట అంబానీ.
ఈ విషయాన్నీ ఇటీవల ఓ ఛానల్ ముఖాముఖిలో స్వయంగా అంబానీయే స్పష్టం చేశారు. అంతేకాదు ఇప్పటికీ అదే రెస్టారెంట్ తనకు ఫేవరేట్ అని చెప్పారు.
ఇష్టమైన వంటకం ఇదే..!
అంబానీకి ఇష్టమైన వంటకం.. కేఫ్ మైసూర్లో చేసే ఇడ్లీ సాంబార్. నిజమేనండీ బాబు. దాని ధర కేవలం రూ.45. భారత్‌లో ఎక్కువ మంది ఉదయం అల్పాహారంగా తీసుకునే ఇడ్లీనే.. దేశంలో అత్యంత ధనవంతుడికి ఇష్టమైన ఆహారం. ఈ విషయం చెబుతూ పలు పత్రికల్లో వచ్చిన ముకేశ్ ముఖాముఖి పేపర్ కట్టింగ్స్‌ను ఈ నాలుగు రెస్టారెంట్లలో మనం చూడొచ్చు.
ముకేశ్ అంబానీనే కాదు.. కేఫ్ మైసూర్ అంటే బాలీవుడ్‌లోని కపూర్ కుటుంబానికి మక్కువే. భారత ఛార్లీ చాప్లిన్గా పిలుచుకునే ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు రాజ్‌కపూర్ తరచూ ఇక్కడికి వస్తుండేవారు. రెస్టారెంట్ యజమానికి ఆయన రాసిన లేఖను ఇప్పటికీ భద్రంగా దాచుకున్నారు. ఈ రెస్టారెంట్లకు వెళితే రాజ్‌కపూర్ లేఖను చూడవచ్చు.