ప్రపంచ ధనవంతుల జాబితాలోని తొలి పది స్థానాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఛైర్మన్ ముకేశ్ అంబానీ వరుసగా రెండోసారీ స్థానం దక్కించుకున్నారు. ఆసియా, భారత్‌లో అపర కుబేరుడిగా నిలిచారు. 2019కి సంబంధించి హురూన్ విడుదల చేసిన తొమ్మిదో విడత ‘అంతర్జాతీయ ధనవంతుల జాబితా 2020’లో ఆయన సంపద 13 బిలియన్ డాలర్లు పెరిగి, 67 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.4.8 లక్షల కోట్లు) చేరడంతో 9వ స్థానంలో నిలిచారు. దీని ప్రకారం, ఆయన గంటకు రూ.7 కోట్లు సంపాదిస్తున్నట్లు లెక్క తేల్చారు.
![Mukesh Ambani, wealthiest Indian, minted ₹7 cr every hour in 2019: Hurun Rich List](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6217204_sang-1.jpg)
ఆయనతో పాటు ఈ జాబితాలో 34 మంది కొత్తవారు (భారతీయులు) జాబితాలోకి చేరారు. దీంతో మన బిలియనీర్ల సంఖ్య 138కి చేరింది. భారత సంతతికి చెంది ఇతర దేశాల్లో ఉన్న వారిని కూడా కలిపితే ఆ సంఖ్య 170కి పెరిగింది. 1 బిలియన్ డాలర్లు (రూ.7,100 కోట్లు) అంతకంటే ఎక్కువ మొత్తం సంపద కలిగిన వారి జాబితాను హురూన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 2,817 మంది ఉన్నారు. కొత్తగా జాబితాలోకి 480 మంది వచ్చి చేరారు.
ఈ లెక్కన ప్రతి రోజూ ఒకరి కంటే ఎక్కువ మంది బిలియనీర్లు పుట్టుకొచ్చారు. చైనా నుంచి 799 మంది, అమెరికా నుంచి 626 మంది జాబితాలో ఉన్నారు. ఈ దేశాల తర్వాత భారత్ 138 మందితో మూడో స్థానంలో ఉంది.
జాబితాలో తొలి 100 మందిలో మన దేశం నుంచి ముకేశ్ అంబానీతో పాటు గౌతమ్ అదానీ, శివ్ నాడార్ (కుటుంబం) చెరో 17 బిలియన్ డాలర్ల సంపదతో 68వ స్థానం దక్కించుకున్నారు. కోటక్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ 15 బి.డాలర్ల (రూ.లక్ష కోట్లు) సంపదతో 91వ స్థానంలో ఉన్నారు.
![Mukesh Ambani, wealthiest Indian, minted ₹7 cr every hour in 2019: Hurun Rich List](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6217204_sang-2.jpg)
ఇదీ చదవండి:అంబానీకి ఇష్టమైన ఆహారం ఇదే.. ధరెంతో తెలుసా?