కొవిడ్-19 నిర్ధారణకు మరింత మెరుగైన పరీక్ష విధానానికి మైక్రోసాఫ్ట్, అడాప్టివ్ బయోటెక్నాలజీస్ సంస్థలు ‘ఇమ్యూన్ రేస్’ పేరిట అధ్యయనాన్ని ప్రారంభించాయి. దీనిద్వారా మనుషుల్లో కరోనా వైరస్ ఎలా స్పందిస్తుందనేది కచ్చితంగా తేల్చనున్నారు. అమెరికాలోని వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో 18-89 ఏళ్ల వయసున్న వెయ్యి మందిని ఎంపిక చేసి ఈ ‘వర్చువల్ క్లినికల్’ అధ్యయనాన్ని చేపడతారు.
ప్రస్తుతం కొవిడ్ నిర్ధారణకు రెండు రకాల పరీక్షలు చేస్తున్నారు. పీసీఆర్ పరీక్షలో సంబంధిత వ్యక్తుల గొంతు, ముక్కు నుంచి నమూనాలను సేకరిస్తారు. అలాగే యాంటీబాడీలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి రక్తపరీక్షలు చేస్తున్నారు. అయితే... ఈ రెండు విధానాల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు మూడో పరీక్ష విధానం అవసరమని అడాప్టివ్, మైక్రోసాఫ్ట్‌లు భావించి అధ్యయనానికి దిగాయి. ఇందులో పాల్గొనే వారి ఇళ్లకే వెళ్లి రక్తం, ఇతర నమూనాలను సేకరిస్తారు. రక్తంలో ‘టీ సెల్స్’గా పిలిచే ప్రత్యేక కణాల ఉనికిని పరీక్షిస్తారు. దీనిద్వారా ముందుగానే వైరస్‌ను గుర్తించి వ్యాధి వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.