కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఈ) సంస్థలకు సాయం చేసేందుకు మరో రూ.250 కోట్లు కేటాయించినట్లు అంతర్జాతీయంగా చెల్లింపుల సేవలు అందించే సాంకేతిక దిగ్గజం మాస్టర్‌కార్డ్ ప్రకటించింది. 2025 వరకు భారత్‌లో 100 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెడతామన్న సంస్థ గత నిర్ణయానికి అదనంగా ఈ సాయం ప్రకటించింది.
చిన్న వాణిజ్య సంస్థల డిజిటలీకరణకు, ఆయా సంస్థలు రుణాలు సులభతరంగా పొందేలా సాయం చేసేందుకు, మహిళా ఔత్సాహికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.250 కోట్లు వినియోగిస్తామని మాస్టర్‌కార్డ్ దక్షిణాసియా అధిపతి పోరష్ సింగ్ తెలిపారు.
కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతంగా సంస్థ వెచ్చించనున్న 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1875 కోట్ల) సాయంలో భాగంగా ఈ నిధులు భారత్‌కు కేటాయించామన్నారు. కోటి మంది వ్యాపారులు డిజిటల్ పద్ధతిలో నగదు స్వీకరించేలా చేయడమే తమ సంస్థ లక్ష్యమన్నారు సింగ్. దుకాణదారులు, బ్రాండ్లతో ఒప్పందం చేసుకునేలా చేస్తామని, ఇందువల్ల పారదర్శక అమ్మకాలు పెరిగి, ఆర్థిక సంస్థలకు సదరు వ్యాపారాలపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఇందువల్ల రుణాల మంజూరూ సులభమవుతుందని పేర్కొన్నారు.