ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోలో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సౌదీకి చెందిన సావరిన్ ఫండ్.. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(పీఐఎఫ్) 2.33 శాతం వాటా కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ గల్ఫ్ న్యూస్ పేర్కొంది. ఈ మొత్తం వాటాను 1.5 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 11 వేల కోట్లకు పైమాటే) సొంతం చేసుకోనున్నట్లు తెలిపింది.
ఇప్పటికే 9 విదేశీ సంస్థలు జియోలో 22.38 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఈ సంస్థలు జియోలో మొత్తం రూ.104,326.95 కోట్లు పెట్టుబడి పెట్టాయి.
జియో ప్రణాళిక..
2021 వరకు సంస్థను రుణరహితంగా మార్చాలని రిలయన్స్ భావిస్తోంది. ఇందులో భాగంగానే జియో వరుస పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందుకోసం జియోలో 25 శాతం మైనారిటీ వాటాను వాటాదార్లకు విక్రయించాలని నిర్ణయించింది. పీఐఎఫ్ ఒప్పందం కుదిరితే జియోలో వాటా విక్రయాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని తెలుస్తోంది.