జెట్ ఎయిర్వేస్.. భారత విమానయాన రంగంలో 25 ఏళ్ల ప్రస్థానానికి బుధవారం బ్రేక్ పడింది. ఫలితంగా సంస్థలో పనిచేస్తోన్న 22వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. మూడు నెలలుగా జీతాలు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జెట్‌కు ఆర్థికంగా చేయూతనిచ్చి నిలబెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆ సంస్థ ఉద్యోగులు దిల్లీ, ముంబయిలో శాంతియుత ప్రదర్శనలు చేపట్టారు.
"మాకు జీతాలు ఇవ్వాలని మేం అడగట్లేదు. సంస్థను బతికించండి. అదే మమ్మల్ని కాపాడుతుంది."
-జెట్ ఎయిర్వేస్ ఉద్యోగి
"ఏదైనా సంస్థ ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ వాటికి పరిష్కారాలు తప్పక ఉంటాయి. ఎన్నో సంస్థలకు తిరిగి పుంజుకునేందుకు ప్రణాళికలు ఉంటాయి. నన్ను నమ్మండి.. ఒకవేళ జెట్ విమానాలు మళ్లీ ఎగిరితే చరిత్ర సృష్టించినట్టే. అలా జరిగితే మాతో పాటు దేశానికీ ఎంతో గర్వకారణం."
-షిజీ థామస్, జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగిణి
26 ఏళ్లుగా జెట్ సంస్థను నమ్ముకుని జీవిస్తున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, త్వరగా సంక్షోభం నుంచి బయటపడేయాలని కోరుతున్నారు.
"ఇదంతా చూస్తుంటే మా గుండె బాధతో నిండిపోతోంది. మా పరిస్థితి వివరించేందుకు కూడా మాటలు రావటం లేదు. సంస్థ విషయాన్ని పక్కనబెడితే వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిస్సహాయంగా ఉన్నాం. ఎవరూ మాకు సాయం చేయట్లేదు."
-ఆకృతి మోంగా, జెట్ ఎయిర్వేస్ ఉద్యోగిణి
"మందులు కొనాలని నా పిల్లలు అడుగుతున్నారు. ఎక్కడ నుంచి తేవాలి? ఎవరి దగ్గరికి వెళ్లి అడగాలి? మేం ప్రభుత్వాన్ని కాకుండా ఇంకెవరిని అడగాలి?"
-రాజేందర్‌కుమార్, జెట్‌ఎయిర్‌వేస్ ఉద్యోగి
జెట్‌కు తక్షణ రుణసాయంగా రూ.400 కోట్లు అందించేందుకు బ్యాంకర్ల కన్సార్టియం అంగీకరించలేదు. సోమవారం నుంచి జరిగిన సుదీర్ఘ సమావేశాలు జెట్‌ను కాపాడలేకపోయాయి. ఫలితంగా బుధవారం నుంచి సేవలను నిలిపివేస్తున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది.
ఇదీ చూడండి: జెట్ ఎయిర్వేస్ పాక్షిక మూసివేత