దేశీయ కార్యాలయ స్థలాల రంగంలో 2019 ఏడాదికి గాను 2,900 మిలియన్ డాలర్లకు పైగా (దాదాపు రూ.21,000 కోట్లు) ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది.
ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో కార్యాలయాల స్థలాల అద్దెలో టోక్యో 81.0 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో మొదటి స్థానంలో ఉండగా... బెంగళూరు 15.3 మిలియన్ చదరపు అడుగులు, హైదరాబాద్‌లో 12.8 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలం లీజుతో ద్వితీయ, తృతీయ స్థానాలను ఆక్రమించాయి. వీటి తర్వాత దేశ ఆర్థిక రాజధాని ముంబయి 9.7 మిలియన్ చదరపు అడుగులు, దేశ రాజధాని దిల్లీలో 8.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీసు స్థలం అద్దెకు వెళ్లింది.
నివేదిక ప్రకారం దేశంలో 2019లో మొత్తం ఆఫీసు స్థలాల మార్కెట్ 60.6 మిలియన్ చదరపు అడుగుల వరకూ ఉంది. ప్రాథమికంగా ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ, కో వర్కింగ్ రంగాల నుంచి ఎక్కువగా గిరాకీ ఉందని నివేదిక వెల్లడించింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథమేటిక్స్ (స్టెమ్) విభాగాల్లో నిపుణుల లభ్యత అధికంగా ఉండటం, అద్దె ధరలు తక్కువగా ఉండటం వల్ల భారత్ ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాలకు ఆసక్తికరంగా కనిపిస్తోందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది.
ఇదీ చూడండి:అంతర్జాతీయంగా ప్రయాణాలపై కరోనా ఎఫెక్ట్