కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ సడలింపులు ఇచ్చినా.. ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఎక్కడి నుంచి వ్యాధి ఎలా సంక్రమిస్తుందో తెలియక మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ జీవనోపాధికి సాహసం చేయక తప్పని పరిస్థితి. అయితే పని చేసే చోట కొవిడ్-19 సంక్రమించే అవకాశం దాదాపు లేనట్లే అంటే ఉద్యోగులకు ఎంత ప్రశాంతత!
ఆ దిశగానే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆలోచించి, కొవిడ్-19 కార్యాలయాల్లోకి ప్రవేశించకుండా 'రిటర్న్ టు వర్క్‌ప్లేస్' పరిష్కారాలను గురువారం ఆవిష్కరించింది. పెరిగిన శరీర ఉష్ణోగ్రతల (ఈబీటీ) స్క్రీనింగ్‌తో పాటు మాస్కులు ధరించడం, కార్యాలయాల్లో ఎంత మంది పని చేస్తున్నారు? వంటి అంశాలకు క్లౌడ్, ఎడ్జ్ ఆధారిత పరిష్కారాలు తీసుకొచ్చింది. అయితే ఇవి వ్యక్తిగతంగా గుర్తించదగ్గ సమాచారాన్ని (పీఐఐ) గ్రహించవని, కృత్రిమ మేధ బదులుగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), విజన్ అనలిటిక్స్, ఎడ్జ్ కంప్యూటింగ్, 5జీ, ఆర్‌ఎఫ్‌ఐడీ, బయోమెట్రిక్స్, సంజ్ఞల నియంత్రణలు ఆధారంగా మానవ జోక్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవచ్చని ఇన్ఫోసిస్ ఎస్‌వీపీ అండ్ హెడ్-ఇంజినీరింగ్ సర్వీసెస్ నితేశ్ బన్సాల్ వెల్లడించారు.
డేటా సురక్షితం..
ఈ పరిష్కారాలు డేటా గోప్యతా ప్రమాణాలు, ఎఫ్‌డీఏ, ఎఫ్‌సీసీ, ఐఎస్‌ఓ, ఐఈసీ నిబంధనలకు కట్టుబడి ఉంటాయని తెలిపారు. వీటిలో ఈబీటీ తనిఖీల వంటి వాటిని ఇప్పటికే బెంగళూరు, పుణెల్లోని తమ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తమ ఖాతాదారులకు కూడా ఈ పరిష్కారాలను ఇవ్వడం ద్వారా వారి కార్యాలయాలు కూడా కొవిడ్-19 నిరోధకంగా ఉంటాయని, తద్వారా ఉద్యోగులు తిరిగి విధులకు ఎలాంటి భయాలు లేకుండా రాగలుగుతారని ఆయన పేర్కొన్నారు. దీనితో పాటు ఏఐ ఆధారిత డిజిటల్ అసిస్టెంట్ పరిష్కారాన్ని కూడా ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది. ఉద్యోగులు తిరిగి విధులకు హాజరు కావడానికి ఏవైనా సమస్యలుంటే వాటికి ఇది సమాధానాలు ఇస్తుంది. అలాగే కార్యాలయాల్లో సీట్ల భర్తీ, సాంద్రత, అందరూ తిరిగే కామన్ ఏరియాల్లో ఆటోమేట్ శానిటేషన్ వంటి వాటికి ఇది పరిష్కారాలు సూచించనుంది.
ఇదీ చూడండి:వరుసగా ఆరో రోజు పెట్రోధరలు పైపైకి