బిర్లా గ్రూపు సంస్థల మూల పురుషుడు, పారిశ్రామికవేత్త బీకే బిర్లా కన్నుమూశారు. 98 ఏళ్ల వయసున్న బిర్లా వయోభారంతో బాధపడుతూ ముంబయిలో బుధవారం తుదిశ్వాస విడిచారు. పారిశ్రామిక వేత్తగానే కాకుండా.. బీకే బిర్లా పలు దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు.
భారత పారిశ్రామిక రంగానికి బీకే బిర్లాను ఆద్యుడిగా పేర్కొంటారు. ఈ రంగంలో ఎన్నో విశేషమైన సేవలందించిన బిర్లా పూర్తి పేరు బసంత్ కుమార్ బిర్లా. కృష్ణార్పణ్ ఛారిటీ ట్రస్ట్, బీకే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(బీకేబీఐఈటీ) లతో పాటు ఇతర సంస్థలకూ ఛైర్మన్గా పనిచేశారు. దేశంలో ఉన్నత విద్య అభివృద్ధికి బిర్లా తనవంతు కృషి చేశారు.
15వ ఏటనే వ్యాపారంలోకి..
బీకే బిర్లా 1921 లో ఘనశ్యామ్ బిర్లా దంపతులకు జన్మించారు. సెంచురీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్గా వ్యవహరించిన బిర్లా.. 15 ఏళ్ల వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.
కేసోరామ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్గా వ్యాపార ప్రస్థానాన్ని ఆరంభించారు. కాటన్, పాలిస్టర్, నైలాన్, కాగితం, షిప్పింగ్ సహా సిమెంట్, టీ, కాఫీ ఉత్పత్తుల వంటి రంగాలలో రాణించారు. బిర్లాకు ఆదిత్య విక్రమ్ బిర్లా ఒక్కరే కుమారుడు. 1995లోనే ఈయన కన్నుమూశారు. బీకే బిర్లా అంత్యక్రియలను నేడు నిర్వహించనున్నట్లు తెలిపారు ఆయన మనువడు, ఆదిత్య బిర్లా గ్రూపు అధినేత కుమార మంగళం బిర్లా.