Rahul Bajaj passed away: ప్రముఖ వ్యాపారవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూశారు. వయోసంబంధ సమస్యలతో కొద్దిరోజులుగా బాధపడుతున్న 83 ఏళ్ల రాహుల్ బజాజ్... మహారాష్ట్ర పుణెలో తుదిశ్వాస విడిచినట్లు బజాజ్ గ్రూప్ ప్రకటన విడుదల చేసింది. చివరి క్షణాల్లో కుటుంబసభ్యులు ఆయన వెంటే ఉన్నారని అందులో పేర్కొంది. ఆదివారం రాహుల్ బజాజ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఉన్నత స్థాయికి ఎదిగి...
1965లో బజాజ్ గ్రూప్ బాధ్యతలను స్వీకరించిన రాహుల్ బజాజ్.. ద్విచక్ర వాహన రంగంలో ఆ సంస్థను ఉన్నతస్థితికి చేర్చారు. హమారా బజాజ్ నినాదంతో పేదవాడికి సైతం ద్విచక్రవాహనాలను అందుబాటులోకి తెచ్చారు. అనంతర కాలంలో ఆటోమొబైల్స్‌తో పాటు జీవితబీమా, గృహ వినియోగ వస్తువులు, విద్యుత్ ల్యాంపులు, పవన విద్యుత్, ఉక్కు ఉత్పత్తి రంగాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.
2005లో తన విధుల నుంచి తప్పుకోగా ఆయన కుమారుడు రాజీవ్ బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన ఇద్దరు కుమారులు రాజీవ్, సంజీవ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గానూ వైదొలిగారు. ఇప్పటివరకూ గౌరవ ఛైర్మన్‌గా కొనసాగారు. 2006 నుంచి 2010 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించింది.
ప్రముఖుల సంతాపం
రాహుల్ బజాజ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలకు ఎప్పటికీ స్పూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. రాహుల్ మృతికి ప్రముఖ వ్యాపారవేత్తలు..నివాళులు అర్పించారు. బయోకాన్ అధినేత్రి కిరణ్ మజుందార్ షా... మంచి ఆప్తుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని ట్వీట్ చేశారు. దేశ వాణిజ్య రంగంపై చెరగని ముద్ర వేశారని మహీంద్రా సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.