షాపింగ్ ఫీచర్‌కు అతిపెద్ద మార్కెట్లలో.. భారత్ ఒకటిగా ఉన్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. ఈ ఫీచర్‌కు చిన్న, మధ్య తరహా వ్యాపారస్థుల నుంచి భారీ స్పందన వస్తున్నట్లు పేర్కొంది. ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఈ ఫీచర్‌ను వినియోగిస్తున్నట్లు పేర్కొంది.
ఏంటి ఈ షాపింగ్ ఫీచర్..
రిటైల్ విక్రయదార్లు అందించే ఆఫర్లను సులువుగా తెలుసుకుని, ఒకే ఉత్పత్తికి వివిధ కంపెనీలు ఇచ్చే ఆఫర్లను సమీక్షించుకునేందుకు వీలుగా ఈ ఫీచర్‌ను తీసుకువచ్చింది గూగుల్. గత ఏడాది డిసెంబర్లో ఆవిష్కరించింది.
"గత ఏడాది గూగుల్ ఈ ఫీచర్‌ను ఆవిష్కరించినప్పటి నుంచి గూగుల్ షాపింగ్‌కు భారీ స్పందన వస్తోంది. భారత్‌లో ఇతర మార్కెట్లతో పోలిస్తే.. గూగుల్ షాపింగ్‌లో వినియోగదారులు ఎక్కువ సమయం గడిపారు. "
- సురోజిత్ ఛటర్జీ, గూగుల్ షాపింగ్ ఉపాధ్యక్షుడు (ఉత్పత్తుల నిర్వహణ)
కొత్త టూల్..
షాపింగ్ ఫీచర్లో చిన్న, మధ్య తరహా వ్యాపారులు వెబ్సైట్లకు 30 శాతం క్లిక్‌లు పెరిగాయని ఛటర్జీ తెలిపారు. వినియోగదారులతో సులభంగా అనుసంధానమయ్యేందుకు వీలుగా 'గూగుల్ మై బిజినెస్(జీబీఎం)' అనే కొత్త టూల్‌ను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
జీఎంబీ ద్వారా.. స్థానిక రిటైలర్లు ఎవరైనా ఆన్లైన్ స్టోర్‌ను సృష్టించుకోవచ్చు. దీని ద్వారా ఏదైనా ఉత్పత్తికోసం వెతికే లక్షలాది వినియోగదారులతో అనుసంధానమయ్యే వీలుంటుంది. రిటైలర్లు ఉత్పత్తుల ఫోటోలను తమ స్టోర్‌లో ఉంచితే.. అవి నేరుగా గూగుల్ షాపింగ్ ట్యాబ్‌లో కనిపిస్తాయి.
ఈ ఫీచర్ ఆవిష్కరణలో భాగంగా.. ఇప్పటికే 20,000 మంది స్థానిక వ్యాపారులను జీఎంబీ పరిధిలోకి తీసుకువచ్చింది గూగుల్. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ఫీచర్ భారత్‌లో అందుబాటులోకి రావచ్చని ఆయన అన్నారు.
స్థానిక భాషలకు విస్తరణ..
వచ్చే మూడేళ్లలో 50 కోట్ల మంది ఆంగ్లం మాట్లాడని వినియోగదారులు ఆన్‌లైన్‌ను వినియోగించే అవకాశముందని సరోజిత్ ఛటర్జీ అన్నారు. అలాంటి వారి కోసం.. స్థానిక భాషల్లోనూ ఈ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. స్థానిక భాషల్లో తొలుత హిందీతో ఈ ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం వ్యాపారులు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఇదీ చూడండి:మారుతీ చిన్న కారు.. పెద్ద రికార్డు