ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కరోనా వైరస్ కలవర పెడుతోంది. చైనాలో మొదలై మహమ్మారిగా మారి... ఇతర దేశాలకు విస్తరిస్తున్న ఆ జాడ్యం పారిశ్రామిక- ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దేశాల మధ్య ఎగుమతులు- దిగుమతులు నెమ్మదిస్తున్నాయి. ముడిచమురు ధర పతనం అవుతోంది. ఎప్పుడూ కిక్కిరిసి ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రయాణికులు తగ్గి కళావిహీనం అవుతున్నాయి. 'కరోనా' జాగ్రత్తల్లో అన్ని దేశాలు తలమునకలుగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులు కలవరపాటుకు గురవుతున్నారు. రేపు ఏం జరుగుతుందో.. ఎలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందో... అనే భయంతో వారికి కంటి మీద కునుక కరవవుతోంది. ఫలితంగా స్టాక్‌మార్కెట్లలో లావాదేవీల మొత్తం తగ్గుతుండగా, బంగారం వంటి రక్షణాత్మక సాధనాలపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. మరోపక్క 'కరోనా' భయంతో షేర్లను తెగనమ్ముకోవలసిన పని లేదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఏదీ లేదని అనుభవం కల మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అనుకున్నదొక్కటి అయ్యింది మరోటి..
చైనాలో కరోనా వైరస్ (కొవిడ్ 19) కొత్త కేసుల విజృంభణ తగ్గిందనే వార్తల నడుమ, ఈ వారాన్ని హుషారుగా ప్రారంభిద్దామనుకున్న మదుపరికి సోమవారం ఉదయమే దిమ్మతిరిగే పరిస్థితి కనిపించింది. ప్రపంచ సూచీలన్నీ ఎరుపు రంగులోకి మారిపోయాయి. దక్షిణకొరియా, ఇటలీల్లో కరోనా మరణాలు సంభవించగా, అమెరికా, ఇరాన్, సింగపూర్, హాంకాంగ్‌లలోనూ ఈ వైరస్ బాధితులు నమోదు కావడం వల్ల ఆర్థిక మార్కెట్లలో కలవరం పెరిగింది. ఒకటి రెండు రోజులు మినహా స్టాక్ మార్కెట్లపై ప్రభావమూ పెద్దగా లేనందున, వైరస్ వ్యాప్తి త్వరలోనే అదుపులోకి వస్తుందని, పరిస్థితులు చక్కదిద్దుకుంటాయనే నమ్మకంతో మదుపర్లున్నారు. కానీ కరోనాపై భయాలతో సోమవారం ప్రపంచ దేశాల మార్కెట్లన్నీ భారీ నష్టాలు మూటకట్టుకున్నాయి. అమెరికా మార్కెట్లు ఏకంగా రెండేళ్లలోనే అత్యధిక ఒక రోజు నష్టాన్ని చవిచూశాయి. మన మార్కెట్లకూ ఆ సెగ తాకింది. వరుసగా మూడు రోజులుగా సూచీలను నష్టాలు పలుకరించాయి. ఇప్పుడు భయాలు ఇంకా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో తమ పెట్టుబడులు కొనసాగించాలో.. తెగనమ్ముకొని బయటకు రావాలో తెలియక మదుపరులు మదనపడుతున్నారు.
విజృంభణతో విలయం
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా చైనాపై పారిశ్రామిక, వాహన విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్, ముడిఔషధ ఉత్పత్తుల కోసం ప్రపంచ దేశాలన్నీ ఆధారపడ్డాయి. కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య సుమారు 80,000 వరకు ఉండటంతో, చైనాలో తయారీ యూనిట్లు చాలావరకు మూసి ఉంటున్నాయి. అందువల్ల చైనాతో వ్యాపార సంబంధాలు అధికంగా ఉన్న దేశాలకూ ఈ సెగ తాకడం తప్పనిసరి. కరోనా వైరస్ విజృంభణ ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉందని మూడీస్ అంచనా వేస్తోంది.
కోలుకున్నా.. తాత్కాలికమేనా?
సోమవారం నాటి భారీ నష్టాల అనంతరం ప్రపంచ మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. బుధవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. ఒకవేళ మార్కెట్లు మళ్లీ కోలుకున్నా దానిని తాత్కాలిక ఊరటగానే చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా వైరస్ పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చేవరకు దాని ప్రభావం అంతర్లీనంగా స్టాక్ మార్కెట్లలో కొనసాగుతూనే ఉంటుందని, ఒకవేళ తీవ్ర రూపం దాలిస్తే మార్కెట్లు తీవ్రంగానే నష్టపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లలో లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు.
చమురు డీలా.. బంగారం భళా
చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం చైనా కావడం, కార్యకలాపాలు మందగించడం కారణంగా గిరాకీ తగ్గి చమురు ధర డీలా పడింది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తరలివచ్చి బంగారం ధర భగ్గుమంటోంది.
భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సునిశితంగా గమనిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అనుకున్న సమయం ప్రకారమే ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ జరుగుతోందని చెప్పారు.
వేటికి చిక్కు..
చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర రూపం దాలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఈకింది రంగాల షేర్లపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
- వాహన విడిభాగాలు
- ఎఫ్‌ఎమ్‌సీజీ నీ ఔషధ
- లోహాలు/ గనులు
- పర్యాటకం
- ఆతిథ్యం
- చమురు
- విమానయానం
ప్రసార మాధ్యమాల్లో కరోనా వార్తల ఆధారంగా షేర్లు కొనొద్దు, అమ్మొద్దు. ఒకవేళ మీకిష్టమైన షేరు తక్కువకే లభిస్తుందని భావిస్తే, పనితీరు ఆధారంగానే కొనండి. అనవసర భయాందోళనతో తెగనమ్ముకోవద్దు.- వారెన్ బఫెట్, ప్రముఖ మదుపరి
ఇదీ చూడండి:వేలానికి 'మోదీ' పెయింటింగ్స్, విలాసవంతమైన కార్లు