ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా దేశంలోనే సంపన్నమైన మహిళగా నిలిచారు. రూ. 54,850 కోట్ల ఆస్తితో ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. రూ. 36,600 కోట్ల నికర ఆస్తితో బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందర్ షా రెండో స్థానంలో ఉన్నారు.
వంద మంది సంపన్న మహిళలతో కూడిన ఈ జాబితాను హురున్ ఇండియా, కోటక్ వెల్త్ సంయుక్తంగా రూపొందించాయి. జాబితాలోని 31 మంది మహిళల నికర ఆస్తుల విలువ కనీసం వంద కోట్లుగా ఉంది. వీరిలో ఆరుగురు ప్రొఫెషనల్ మేనేజర్లు, 25 మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు.
అందులో మజుందర్ ముందు
సెల్ఫ్ మేడ్ కేటగిరీలో మజుందర్ షా ప్రథమ స్థానంలో ఉండగా.. జోహోకు చెందిన రాధా వెంబు(రూ. 11,590 కోట్ల నికర విలువ), అరిస్తా నెట్వర్క్స్కు చెందిన జయశ్రీ ఉల్లాల్(రూ.10,220 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరంతా హురున్ సంస్థ రూపొందించే ప్రపంచవ్యాప్త ధనిక మహిళల జాబితాలోనూ చోటు దక్కించుకోవడం విశేషం.
- ఈ జాబితాలో ఉన్న మహిళల సగటు వయసు 53.
- వీరందరి నికర ఆస్తి మొత్తం రూ. 2.72 లక్షల కోట్లు
- వంద మందిలో 19 మంది మహిళల వయసు 40 లోపే.
- అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైస్ నుంచి నలుగురు మహిళలు, గోద్రెజ్ గ్రూప్‌నకు చెందిన ముగ్గురు మహిళలు ఇందులో చోటు దక్కించుకున్నారు.
స్టార్టప్‌లను స్థాపించిన ఇద్దరు మహిళలకు ఇందులో స్థానం లభించింది. నైకా వ్యవస్థాపకులు ఫాల్గునీ నాయర్ రూ.5,410 కోట్లు, బైజుస్ స్థాపకుడు రవీంద్రన్ భార్య దివ్య గోకుల్‌నాథ్ రూ.3,490 కోట్లతో ఈ జాబితాలో చోటు సంపాదించారు.