ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో వివాదం విషయంలో ఫ్యూచర్ గ్రూప్‌నకు దిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట లభించింది. రిలయన్స్ రిటైల్‌తో ఒప్పందం విషయంలో ఏ మాత్రం ముందుకెళ్లొద్దని, కిశోర్ బియానీ సహా ఇతర ప్రమోటర్ల ఆస్తులను అటాచ్ చేయాలని ఏకసభ్య ధర్మాసనం గత వారం వెలువరించిన తీర్పుపై డివిజన్ బెంచ్ సోమవారం స్టే ఇచ్చింది. ఫ్యూచర్ గ్రూప్ అప్పీలుపై స్పందించాలని అమెజాన్‌కు నోటీసులు పంపింది.
వివాదం ఇదీ..
రిలయన్స్ రిటైల్‌తో ప్యూచర్ గ్రూప్ కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందంలో సింగపూర్ ఆర్బిట్రేషన్ ప్యానెల్ తీర్పును సమర్థిస్తూ.. జస్టిస్ ఆర్జే మిధా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం గత వారం తీర్పునిచ్చింది. ఫ్యూచర్ రిటైల్ సింగపూర్ ఆర్బిట్రేటర్స్ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినట్లు పేర్కొంది. అమెజాన్‌ను కాదని.. రిలయన్స్ రిటైల్‌తో ఒప్పందం విషయంలో ముందుకెళ్లొద్దని ఫ్యూచర్ గ్రూప్‌ను ఆదేశించింది.
ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ సహా ఇతరులు తమ ఆస్తుల వివరాలతో ఏప్రిల్ 28న కోర్టు ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది ఏకసభ్య ధర్మాసనం. అత్యవసర ఆర్బిట్రేటర్స్ ఆదేశాలను ఉల్లంఘించినందుకు 3 నెలల పాటు ఎందుకు జైలులో పెట్టకూడదో కూడా వివరించాలని బియానీని ఆదేశించింది.
దిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పును.. డివిజెన్ బెంచ్‌లో సవాలు చేసింది ఫ్యూచర్ రిటైల్. దీనిపై సోమవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ఫ్యూచర్ రిటైల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.
ఇవీ చదవండి: