రిలయన్స్ రిటైల్‌కు ఫ్యూచర్ రిటైల్ విక్రయించేందుకు కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందంపై దిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో ఫ్యూచర్ రిటైల్ యథాఫూర్వ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఇరు సంస్థల ఒప్పందానికి ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది న్యాయస్థానం.
రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ రిటైల్ మధ్య ఒప్పందం విషయంలో తమ హక్కులు పరిరక్షించేందుకు మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని అమెజాన్ కోర్టును ఆశ్రయించింది. అమెజాన్ వాదన సంతృప్తికరంగా ఉందని జస్టిస్ జేఆర్ మిదా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు రిజర్వు చేసిన తీర్పు వెలువరించే వరకు యథాపూర్వ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.
ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందంపై సింగపూర్‌కు చెందిన ఏకసభ్య జడ్జి ఆర్బిట్రేషన్ ప్యానెల్ స్టేను ఆధారంగా చేసుకుని దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది అమెజాన్. ఇందులో కిశోర్ బియానీ ఆధీనంలోని ఫ్యూచర్ రిటైల్‌ను ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్‌కు విక్రయించే ప్రక్రియ పూర్తవకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని కోరింది.
ఇదీ చూడండి:సొంత క్రిప్టో కరెన్సీపై ఆర్థిక శాఖ స్పష్టత