చెన్నై ఆధారిత లక్ష్మీ విలాస్ బ్యాంకు(ఎల్వీబీ)పై కేంద్ర ప్రభుత్వం మంగళవారం మారటోరియం విధించింది. ఈ తాత్కాలిక నిషేధం నవంబర్ 17 నుంచి నెలరోజుల పాటు అమలులో ఉంటుంది. దీనితోపాటు బోర్డును రద్దు చేస్తూ డిపాజిటర్ల నగదు ఉపసంహరణ పరిమితిని రూ.25 వేలకు కుదించింది.
లక్ష్మీ విలాస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్న తరుణంలో రిజర్వ్ బ్యాంకు సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్బీఐ ఓ ప్రకటన చేసింది.
"నమ్మదగిన బ్యాంకు పునర్నిర్మాణ ప్రణాళిక లేని కారణంగా.. డిపాజిటర్ల ప్రయోజనాలతోపాటు ఆర్థిక స్థిరత్వం కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు మరో ప్రత్యామ్నాయం లేదు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949లోని సెక్షన్ 45 ప్రకారం మారటోరియం అమలు చేయాలని కేంద్రానికి సూచించాం."
- ఆర్బీఐ ప్రకటన
ఆర్బీఐ అనుమతి లేనిదే..
మారటోరియం సమయంలో, ఆర్బీఐ నుంచి ఎటువంటి రాతపూర్వక అనుమతి లేకుండా డిపాజిటర్లకు రూ.25,000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపులు చేయడానికి బ్యాంకును అనుమతించరు. ఇది సేవింగ్స్, కరెంట్ లేదా ఇతర అన్ని డిపాజిట్ ఖాతాలకు వర్తిస్తుంది.
బోర్డు రద్దు..
ఎల్వీబీ ప్రస్తుత బోర్డును రద్దు చేసిన ఆర్బీఐ.. కెనరా బ్యాంకు మాజీ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ టీఎన్ మనోహరన్‌ను పాలనాధిపతిగా నియమించింది.
విలీనం..
ఇప్పటికే ఎల్వీబీని డీబీఎస్ బ్యాంకులో విలీనం చేయాలని ఆర్బీఐ ముసాయిదాను ప్రకటించింది. మారటోరియం గడువు పూర్తి కాగానే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఏజీఎంలో మొదలైన సమస్య..
సెప్టెంబర్‌లో జరిగిన ఎల్వీబీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో సంస్థలోని నిర్వహణ లోపాలు బయటపడ్డాయి. కరోనా నేపథ్యంలో దృశ్యమాధ్యమంలో జరిగిన ఈ సమావేశంలో బ్యాంకు ఎండీ, సీఈఓ సుందర్ సహా ఆరుగురు డైరెక్టర్ల పునర్ నియామకానికి వ్యతిరేకంగా వాటాదారులు ఓటు వేశారు.
ఈ పరిణామంతో 90 ఏళ్ల చరిత్ర కలిగిన బ్యాంకు విషయంలో బ్యాంకింగ్, ఫినాన్షియల్ రంగంలో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ సంస్థను ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో విలీనం చేయాలని డిమాండ్లు వినిపించాయి.
ఇదీ చూడండి: లక్ష్మీ విలాస్ బ్యాంకు వివాదమేంటి?