పేదలకు కనీస ఆదాయంపై రాజకీయ పార్టీల వాగ్దానాలు ఊపందుకున్నాయి. అయితే అవి అమలు కావాలంటే అధిక పన్నులు, బాండ్ల ద్వారా మాత్రమే సాధ్యమని... వాల్ స్ట్రీట్ బ్రోకరేజి బ్యాంక్ ఆఫ్ అమెరికా అనుబంధ సంస్థ మెరిల్ లించ్ నివేదిక వెల్లడించింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఏటా రూ.72,000 పేదలకు బదిలీ చేసే కనీస ఆదాయ పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించింది.
అధికార భాజపా ఇప్పటికే పేద రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. భాజపా పథకం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.75,000 కోట్ల భారం పడుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన పథకం అమలైతే ఏడాదికి రూ.3.6 లక్షల కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
ఈ పథకాల ద్వారా స్థూల దేశీయోత్పత్తిపై 1.5 నుంచి 2 శాతం వరకు ప్రభావం ఉండొచ్చని తెలిపింది. దీని ద్వారా ద్రవ్యోల్బణం 5 శాతం వరకూ నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది నివేదిక.
ఈ పథకాల కారణంగా కేంద్రంలో ద్రవ్యలోటు పెరిగిపోతుంది. దాన్ని తగ్గించాలంటే వ్యక్తిగత, కార్పొరేట్ ప్రత్యక్ష పన్నులు 6.4 శాతం మేర పెంచాల్సి వస్తుందని నివేదిక తెలిపింది. దీంతో పేదరికం మరింత పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది.
వీటితో పాటు నిధులు సమకూర్చుకునేందుకు బాండ్ల జారీ కూడా ఓ మార్గమని నివేదిక అభిప్రాయపడింది. ఆ నిధులను తిరిగి ఈ పథకాలకు వినియోగించొచ్చని పేర్కొంది.