భారత్‌లో ఇంటర్నెట్ వినియోగాన్ని మరింతమందికి చేరువ చేసే విధంగా.. స్థానిక భాషా సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇందులో భాగంగా సెర్చ్ రిజల్ట్స్, మ్యాప్స్‌లో నావిగేషన్ సమాచారం పొందే సదుపాయాన్ని మరిన్ని స్థానిక భాషలకు విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. వీటితో పాటు హిందీలో గణిత సమస్యలకు సమాధానాలనూ తెలుసుకోవచ్చని తెలిపింది. వర్చువల్‌గా జరుగుతోన్న గూగుల్ ఎల్10ఎన్ కార్యక్రమంలో భాగంగా గూగుల్ ఇండియా ఉపాధ్యక్షుడు సంజయ్ గుప్తా వివరాలు వెల్లడించారు. భారత స్థానిక భాషల్లో సమాచారం పొందుపరచటం, సమాచార మార్పిడిలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించటంలో ఈ ఫీచర్లు భాగమేనని తెలిపారు.
" దేశంలో 100 మిలియన్ కన్నా తక్కువ మంది ఇంటర్నెట్ వినియోగదారుల ఉన్నప్పటికీ గూగుల్ సెర్చ్ 9 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. కొనేళ్లుగా.. మా ఉత్పత్తులు భారతీయ భాషలు మాట్లాడేవారికి ఉపయోగపడే విధంగా చేయడానికి మేము చాలా కష్టపడ్డాం. భారత్‌లో మెట్రో నగరాల బయట ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. గత రెండు సంవత్సరాల్లోనే 100 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు కొత్తగా చేరారు. కొత్తగా వస్తోన్న వినియోగదారుడు స్థానిక భాషకు సంబంధం ఉన్నవారే. స్థానిక భాషా సామర్థ్యాన్ని పెంచేందుకు మూడు పాయింట్ల వ్యహాన్ని అనుసరిస్తున్నాం. "
- సంజయ్ గుప్తా , గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్
ప్రస్తుతం తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ భాషలను కొత్తగా చేర్చింది గూగుల్. స్థానిక అంశాలను ఇంగ్లీష్ లో సెర్చ్ చేసినా సంబంధిత సమాచారం భారతీయ భాషల్లో వచ్చే నెల నుంచి అందుబాటులో ఉంటుందని గుప్తా చెప్పారు. గూగుల్ మ్యాప్స్‌కు కూడా ఈ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. వినియోగదారులు తమ మ్యాప్స్‌ను తొమ్మిది భారతీయ భాషల్లో చూడొచ్చు. ప్రాంతాల కోసం శోధించటం, దిశలు, నావిగేషన్ పొందడానికి వీలు కల్పిస్తుంది. గూగుల్ లెన్స్ ద్వారా గణితం లెక్కలను ఫోటో తీసి.. హిందీ, ఆంగ్ల భాషల్లో పరిష్కరించుకోవచ్చని తెలిపింది గూగుల్.
ఇదీ చూడండి:రివ్యూ 2020: ఉత్తమ స్మార్ట్ డివైజ్‌లు ఇవే..