క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో గూగుల్ సంస్థ సరికొత్త చరిత్రకు నాంది పలికింది. సూపర్ కంప్యూటర్లను మించిన వేగంతో పని చేసే అత్యాధునిక ‘సికమోర్’ చిప్‌ను అభివృద్ధి చేసింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ 10 వేల ఏళ్లలో పూర్తి చేసే గణనను ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ కేవలం 200 సెకన్లలో పూర్తిచేసినట్లు గూగుల్ ప్రకటించింది. తాజా ఆవిష్కరణను ‘'క్వాంటమ్ సుప్రిమసీ'’గా అభివర్ణించింది. ‘నేచర్’ జర్నల్‌లో సంబంధిత వివరాలు బుధవారం ప్రచురితమయ్యాయి. సాధారణ కంప్యూటర్లు బైనరీ సంఖ్యల ఆధారంగా డేటా ప్రక్రియలను నిర్వహిస్తాయి. సికమోర్ చిప్ బైనరీ సంఖ్యలతోపాటు 54-క్యూబిట్స్‌తో కూడిన క్వాంటమ్ ప్రాసెసర్ ఆధారంగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చిప్‌లో ప్రతి క్యూబిట్ మరో నాలుగు క్యూబిట్‌లతో అనుసంధానమై ఉంటుంది. ఫలితంగా గణన ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతుందని గూగుల్ కృత్రిమ మేధ(ఏఐ) శాస్త్రవేత్త జాన్ మార్టిన్స్ తెలిపారు.
ఐబీఎం సందేహాలు
వాస్తవానికి గూగుల్ ‘క్వాంటమ్ సుప్రిమసీ’కి సంబంధించిన కొన్ని వివరాలు గత నెల్లోనే బయటకొచ్చాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో విస్తృత పరిశోధనలు కొనసాగిస్తున్న ఐబీఎం సంస్థ సికమోర్ చిప్ పనితీరుపై సందేహాలు వెలిబుచ్చింది. చిప్ పనితీరును మరీ ఎక్కువ చేసి చెప్తున్నారని పేర్కొంది. ‘సికమోర్’ 200 సెకన్లలో చేసే గణనలను సంప్రదాయ ప్రాసెసర్లతో కూడిన కంప్యూటర్లు రెండున్నరేళ్లలో పూర్తిచేయగలవని అభిప్రాయపడింది.
గర్వంగా ఉంది
క్యాంటమ్ కంప్యూటింగ్ చిప్‌ను అభివృద్ధి చేయటంపై హర్షం వ్యక్తం చేశారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.
"మా ఏఐ శాస్త్రవేత్తలు క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్‌ను అభివృద్ధి చేయడం గర్వ కారణం. ఇదో భారీ ముందడుగు. దశాబ్దానికిపైగా కృషితో ‘క్వాంటమ్ సుప్రిమసీ’ సాధ్యమైంది. దీన్ని సుసాధ్యం చేసే పరిశోధనల్లో పాలుపంచుకున్నవారందరికీ కృతజ్ఞతలు."
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
ఇదీ చూడండి: పెన్షన్ ప్రపంచ సూచీలో మెరుగైన భారత్ ర్యాంకు