గూగుల్‌కు ఐటీ నిబంధనలు(IT Rules 2021) వర్తిపంజేస్తూ ఇదివరకు దిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ఆ సంస్థ సవాల్ చేసింది. కేంద్రం విధించిన నిబంధనలు తమ సెర్చ్ ఇంజిన్‌కు వర్తించవని పేర్కొంది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం స్టే విధించాలని విజ్ఞప్తి చేసింది. ఆ న్యాయమూర్తి తమ సంస్థను సామాజిక మాధ్యమాల కిందకు వస్తుందని తప్పుగా పేర్కొన్నారని తెలిపింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టీస్ జ్యోతి సింగ్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టిన సందర్భంగా గూగుల్ ఈ వాదనలు వినిపించింది.
గూగుల్ వాదనలపై స్పందించిన ధర్మాసనం బాధిత మహిళ, సంబంధిత పోర్నోగ్రఫిక్ సైట్ సహా ఫేస్బుక్, కేంద్రం, దిల్లీ ప్రభుత్వం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. జూలై 25లోగా దీనిపై స్పందించాలని ఆదేశించింది. సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే ఇచ్చే అవకాశం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇటీవల ఓ మహిళ తన చిత్రాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోర్నోగ్రఫిక్ సైట్లలో అప్లోడ్ చేశారని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించింది. తక్షణం ఆ చిత్రాలను అంతర్జాలం నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించినా.. పూర్తిస్థాయిలో అది అమలు కాలేదు. దీంతో న్యాయమూర్తి గూగుల్‌కు కొత్త ఐటీ నిబంధనలు(IT Rules 2021) వర్తిస్తాయని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇదీ చదవండి : New IT Rules: ట్విట్టర్‌కు హైకోర్టు షాక్!