గత ఐదేళ్ల కాలంలో.. ప్రతి రెండు కుటుంబాల్లో ఒకటి బంగారాన్ని కొనుగోలు చేసిందని ఒక సర్వే నివేదిక తేల్చింది. పైగా 87శాతం మంది భారతీయలు తమ బంగారాన్ని నగల రూపంలో ఉంచుకునేందుకే ఇష్టపడతారట. పసిడే కాకుండా.. వజ్రాలు, ఇతర విలువైన లోహాలు కూడా ఇప్పుడు నగల్లో భాగమయ్యాయి. మరి.. ఇంత విలువైన సంపదకు సరైన భద్రత కల్పించారా?
లాకర్లలో పెడితే...
విలువైన నగలను భద్రపరిచేందుకు ఇప్పటికీ చాలామంది బ్యాంకు లాకర్లనే ఆశ్రయిస్తారు. ఇదే అత్యంత సురక్షితమైన ప్రదేశంగా భావిస్తుంటారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆలోచన మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బ్యాంకు లాకర్లలో పెట్టిన బంగారానికి బ్యాంకులు ఏ మాత్రం బాధ్యత వహించవు.
అంటే.. ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాల వల్ల లాకర్లకు ఏదైనా ప్రమాదం జరిగి.. మన నగలకు ఎలాంటి నష్టం వాటిల్లినా బ్యాంకులు బాధ్యత తీసుకోవు. అందులోనూ.. బ్యాంకులో దొంగలు పడి, లాకర్లు కొల్లగొట్టినా.. బ్యాంకులు బాధ్యత తీసుకోకపోవచ్చు.
ఫలితంగా.. గతంలోలాగా లాకర్లలో బంగారం పెడితే.. పూర్తి సురక్షితం అని చెప్పలేం. మరి, మన నగలకు రక్షణ ఎలా.. ఆభరణాల బీమా (జ్యువెలరీ ఇన్సూరెన్స్) తీసుకోవడమే మార్గం.
ధీమాగా ఉండేందుకు..
ప్రస్తుతం చాలా సాధారణ బీమా సంస్థలు గృహ బీమా పాలసీలో అంతర్గతంగా ఆభరణాల బీమానూ అందిస్తున్నాయి. ఈ పాలసీలను ఎంచుకుంటే.. ఇంట్లో ఉన్న నగలతో పాటు, బ్యాంకు లాకర్లలోని ఆభరణాలకూ రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు, ధరించినప్పుడు పొరపాటున పోయినా పరిహారం పొందవచ్చు.
అంటే, ఒకసారి బీమా పాలసీ తీసుకుంటే.. వాటికి సంబంధించినంత వరకూ ఎల్లవేళలా రక్షణ ఉన్నట్లే. గృహ బీమాలో భాగంగా తీసుకునే ఆభరణాల బీమా పాలసీ.. ప్రమాదవశాత్తు నగలు పోయినప్పుడే కాకుండా అగ్ని ప్రమాదాలు, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎదురయ్యే ప్రమాదాల నుంచీ రక్షణ కల్పిస్తుంది.
ఆభరణాలకూ ప్రత్యేకంగా...
గృహ బీమాలో భాగంగానే కాకుండా.. కేవలం ఆభరణాలకు మాత్రమే బీమా తీసుకునే వెసులుబాటును కూడా కొన్ని సాధారణ బీమా సంస్థలు అందిస్తున్నాయి. ఇందులోనూ అన్ని రకాల నష్టాలకు పరిహారం లభిస్తుంది. దీనికి ప్రీమియం వస్తువుల విలువను బట్టి వసూలు చేస్తారు. క్లెయిం చేసుకోవాల్సి వచ్చినప్పుడు పాలసీ కొనుగోలు చేసిన సమయంలో పేర్కొన్న మొత్తాలను బట్టి పరిహారం చెల్లిస్తారు.
''విలువైన వస్తువుల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కుదరదు. ముఖ్యంగా మానసికంగా పెనవేసుకుపోయే బంగారు ఆభరణాలకు సంబంధించి. దురదృష్టవశాత్తూ.. నగలకు నష్టం వాటిల్లినప్పుడు, తద్వారా వచ్చిన ఆర్థిక నష్టాన్ని తిరిగి పొందేందుకు తప్పనిసరిగా ఈ తరహా బీమా పాలసీలు ఉండాలి. పాలసీ తీసుకునేప్పుడు అన్ని వివరాలూ పూర్తిగా తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి.''
- పరాగ్ వేద్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్