రాజకీయ నాయకుల వరుస ప్రయాణాలతో మార్చి-ఏప్రిల్లో దేశీయ విమాన రంగం భారీగా పుంజుకుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారం కోసం అత్యధికంగా చార్టర్ ఫ్లైట్లను అద్దెకు తీసుకుని ప్రయాణాలు చేయడమే ఇందుకు ప్రధాన కారణం.
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజా గణాంకాల ప్రకారం గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో చార్టర్ విమాన ప్రయాణాల సంఖ్య 11.2 శాతం వృద్ధి నమోదుచేసింది. మొత్తం విమాన ప్రయాణాల సంఖ్య 2018లో మార్చిలో 24,229. ఈ ఏడాది మార్చిలో 26,964 విమాన ప్రయాణాలు నమోదయ్యాయి. ఫలితంగా గడచిన ఆరునెలలతో పోలిస్తే ఈ రెండు నెలల్లో భారీగా లాభాలను నమోదు చేశాయి విమానయాన సంస్థలు.
"మార్చి-ఏప్రిల్ నెలల్లో మా విమానాలన్నీ వినియోగించాం. నిజం చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాల్లోనే ఈ రెండు నెలలు మంచి లాభాలను తెచ్చాయి. ఇది ముందుగా అంచనా వేసిన విషయమే. ఎందుకంటే ఎన్నికల ప్రచారానికి విమానాల అవసరం అధికంగా ఉంటుంది. ఈ రెండు నెలల్లో అన్ని చార్టర్ విమాన సంస్థల ఎయిర్ క్రాఫ్ట్లు నిరంతరాయంగా పని చేశాయి. సాధారణ సమయాల్లో వీటి వినియోగం 80 శాతంగా ఉంటుంది."
-రాజన్ మెహ్రా, క్లబ్ వన్ ఎయిర్ సీఈఓ
క్లబ్ వన్ ఎయిర్ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద చార్టర్ విమాన సేవలందించే సంస్థగా ఉంది. ఈ సంస్థకు సీఆర్జే-100, ఫాల్కన్ 200 వంటి విలాసవంతమైన విమానాలతో కలిపి మొత్తం 10 చార్టర్ విమానాలు ఉన్నాయి.
"ఎన్నికల సమయంలో చిన్న విమానాల వినియోగం అధికంగా ఉంటుంది. దాదాపు అన్ని సంస్థలు తమ విమానాలను పూర్తిగా వినియోగిస్తాయి. డిమాండుకు తగ్గట్లు మరిన్ని విమానాలనూ తెప్పిస్తాయి. ఈ సమయంలో సాధారణం కన్నా అధిక లాభాలు ఆర్జిస్తాయి."
- కెప్టెన్ బాలీ, బిజినెస్ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఎండీ
"ఎన్నికల ప్రచార రద్దీ దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు ముందుగానే విమానాలను బుక్ చేసుకున్నాయి. డిమాండు పెరగటం వల్ల కొన్ని సార్లు విమానాల కొరత కూడా ఏర్పడుతుంది."
-కెప్టెన్ పంకజ్ చోప్రా, ఈఐహెచ్ ఏవియేషన్ సంస్థ డైరెక్టర్
ఎన్నికల సమయంలో విమానాలతో పాటు హెలికాప్టర్లకు భారీ గిరాకీ వచ్చిందంటున్నాయి పలు సంస్థలు. నేతలు చిన్న పట్టణాలకు వెళ్లేందుకు హెలికాప్టర్లు వినియోగించడం ఇందుకు కారణం.