రిలయన్స్ రిటైల్.. ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం (Reliance Future deal) విషయంలో సింగపూర్ ఆర్బిట్రేటర్ ఇచ్చిన తీర్పు అమలుపై హైకోర్టు చేపడుతున్న విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఫ్యూచర్ కూపన్స్, ఫ్యూచర్ రిటైల్ ఆస్తుల జప్తు కోసం పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాల విచారణ నిలిపివేయాలని స్పష్టం చేసింది.
అదే సమయంలో, దీనిపై నాలుగు వారాల వరకు ఎలాంటి తుది ఉత్తర్వులు జారీ చేయొద్దని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సెబీకి నోటీసులు జారీ చేసింది.
ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ కూపన్స్ (Future Coupon limited) ఆస్తులు అటాచ్ చేయాలంటూ ఆగస్టు 17 దిల్లీ హైకోర్టు (Delhi HC) తీర్పు చెప్పింది. ఒప్పందంపై ఫ్యూచర్ రిటైల్ ముందుకెళ్లకుండా ఏకసభ్య ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయనున్నట్లు పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ.. ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ కూపన్స్ సంస్థల తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గీ సుప్రీంను ఆశ్రయించారు.
ఫ్యూచర్‌కు ఎదురుదెబ్బ
అమెజాన్‌తో తలెత్తిన రూ.24,713 కోట్ల ఈ కొనుగోలు ఒప్పందం వివాదంలో ఫ్యూచర్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది. సింగపూర్ ఆర్బిట్రేటర్ (singapore arbitration future retail) ఇచ్చిన తీర్పు భారత్‌లోనూ చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది.
అసలు ఏమిటీ వివాదం? (future amazon case)
ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ గత ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.24,713 కోట్లు.
అంతకు ముందే.. ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్ కూపన్స్ లిమిటెడ్‌లో అమెజాన్ 2019లో 49 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్ కూపన్స్‌కు 7.3 శాతం మేర ఫ్యూచర్ రిటైల్‌లో వాటా ఉంది. దీంతో మూడేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫ్యూచర్ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు దఖలు పడింది. అంటే పరోక్షంగా ఫ్యూచర్ రిటైల్‌లో అమెజాన్‌కు కూడా యాజమాన్య హక్కులు ఉన్నాయి.
రిలయన్స్-ఫ్యూచర్ మధ్య కుదిరిన ఒప్పందం తమ హక్కులను ఉల్లంఘిస్తోందని అమెజాన్ వాదించింది. దీనిపై సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టులో ఈ ఒప్పందాన్ని సవాల్ చేసింది. ఆ కోర్టు రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ డీల్‌పై స్టే విధించింది. తుది తీర్పు వెలువడే వరకు ఒప్పందంపై ముందుకెళ్లొద్దని ఆదేశించింది.
విదేశీ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పులు భారత్‌లో చెల్లుబాటు కావని ఫ్యూచర్ గ్రూప్ వాదిస్తూ వచ్చింది. దీంతో మధ్యవర్తిత్వ కోర్టు తీర్పును అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ అమెజాన్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఏకసభ్య ధర్మాసనం తొలుత అమెజాన్‌కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఈ తీర్పును ఫ్యూచర్ గ్రూప్ అదే కోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన విస్తృత ధర్మాసనం మునుపటి తీర్పును తిరగరాస్తూ.. ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లొచ్చని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఉద్యోగంలో గ్యాప్ వచ్చిందా.. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మీకోసమే!