వృద్ధికి ఊతమందించే దిశగా ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ప్రోత్సాహక నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లలో ఈ వారం లాభాల ర్యాలీ ఉండొచ్చని అంటున్నారు నిపుణులు.
విదేశీ మదుపరులపై పెంచిన సర్ఛార్జీలు ఎత్తేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. ఇది మార్కెట్లకు భారీ ఊరటనిచ్చే విషయమని స్టాక్ నిపుణులు అంటున్నారు. రూపాయి క్షీణతకూ ఈ నిర్ణయం అడ్డుకట్ట వేస్తుందని అభిప్రాయపడ్డారు.
స్టార్టప్లకు ఏంజెల్ ట్యాక్స్ మినహాయింపు, చిన్న సంస్థలకు త్వరితగతిన జీఎస్టీ ప్రతిఫలాలు అందివ్వడం వంటి నిర్ణయాలతో ఆయా కంపెనీలపై పెట్టుబడులు పెరుగుతాయని స్టాక్ బ్రోకర్లు అంటున్నారు.
ముఖ్యంగా బ్యాంకులకు మూలధన సాయం కింద రూ.70,000 కోట్లు అందివ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటికి తోడు రెపో రేటు అనుసంధానమైన రుణాలు వంటి నిర్ణయాలతో బ్యాంకుల పనితీరు మెరగుపడుతుందన్నది నిపుణుల విశ్లేషణ.
ఆటో గేర్ మారేనా..?
ఆటో మొబైల్ సంక్షోభంపై ఈ వారంలో ఉద్దీపనలు ప్రకటించే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాల్లో జీఎస్టీ తగ్గింపుపై ప్రధానంగా ఆశలున్నాయి. అనుకున్నట్లుగానే ఉద్దీపనలు ప్రకటిస్తే.. మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేసే అవకాశముంది.
అంతర్జాతీయంగా చూస్తే.. చైనా-అమెరికా వాణిజ్య యుద్ధ భయాలు ముదరడం కాస్త ప్రతికూల అంశం.
ఇదీ చూడండి: ప్లాన్ ఏదైనా.. వినోదం ఫ్రీ అంటున్న టెల్కోలు!