బంగారం.. ఎప్పుడూ డిమాండ్ తగ్గని విలువైన లోహం. అన్ని దేశాల్లో పసిడికి మంచి ఆదరణ ఉంటుంది. భారత్‌లో ఆ మోజు ఇంకాస్త ఎక్కవే. ఎందుకంటే మన సంప్రదాయాల్లో బంగారం ఒక భాగం. శుభకార్యాలకు పసిడి వాడకం తప్పనిసరి. భారత్‌లో బంగారానికి ఉన్న డిమాండ్‌లో 50 శాతానికి కారణం పెళ్లిళ్లే అని ఒక అంచనా.
కొనుగోళ్లు భళా...
పెళ్లిళ్ల సీజన్, ఇతర సంప్రదాయపరమైన రోజుల్లో బంగారు కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి. మే 7న అక్షయ తృతీయ పర్వదినాన పసిడి కొనుగోళ్లు గతంతో పోలిస్తే 25 శాతం వృద్ధి చెందడమే ఇందుకు ఉదాహరణ.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 125.4 టన్నుల బంగారం అమ్ముడైంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 5 శాతం అధికం.
ఈ మూడు నెలల్లో గతంలో లేనంతగా 21 రోజుల పాటు పెళ్లిళ్లు ఉండటం.. బంగారు కొనుగోళ్లకు ఊతమిచ్చిందని కౌన్సిల్ పేర్కొంది.
లెక్క మారుతోంది...
ఆభరణాల విషయంలోనే కాదు పెట్టుబడుల్లోనూ భారతీయలు ఎక్కువగా పుత్తడిపై ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే కచ్చితమైన లాభాలు వస్తాయి. సురక్షిత పెట్టుబడి అని నమ్మకం. గత పదేళ్లలో పెట్టుబడులకు ఎన్నో నూతన అవకాశాలు వచ్చినా బంగారం వైపే మొగ్గుచూపడం గమనార్హం.
"సంపదకు బంగారం అనేది సంప్రదాయక నిర్వచనం. ఇది సాంస్కృతిక అంశమే కాదు పెట్టుబడి సాధనం కూడా. పసిడిపై పెట్టుబడి ఎల్లప్పుడూ స్థిరమైన లాభాలను ఇస్తుంది. ఇతర పెట్టుబడి మార్గాలైన ఫిక్సిడ్ డిపాజిట్, బాండ్లు, కొన్ని సందర్భాల్లో రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లతో పోలిస్తే.. బంగారంపై పెట్టుబడులు స్థిరమైన లాభాలు ఇస్తాయి. దేశీయంగా పసిడికి ఉన్న డిమాండే ఇందుకు ప్రధాన కారణం.
స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ఎక్కువ మొత్తం అవసరం. కానీ... బంగారం విషయంలో అలా కాదు. చిన్న మొత్తాలు పెట్టుబడి పెట్టవచ్చు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లోనూ బంగారానికే డిమాండ్."
-రియాజ్ తింగ్నా, గ్రాంట్ థోర్న్టన్ అడ్వైసరీ డైరెక్టర్
పెద్ద నోట్ల రద్దు, పన్నుల వ్యవస్థ మెరుగైన కారణంగా బంగారం, స్థిరాస్తి రంగాల్లో నల్లధనం ప్రవాహం తగ్గిందని అంటున్నారు నిపుణులు.
జన్‌ధన్‌తో అటా ఇటా...?
సమ్మిళిత ఆర్థికాభివృద్ధి లక్ష్యంతో బ్యాంకింగ్ రంగాన్ని పేదలకు చేరువ చేసింది కేంద్రం. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద ఐదేళ్లలో దాదాపు 34 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించింది.
ఇప్పుడు... ప్రజలు సొమ్మును బ్యాంకుల్లో జమ చేసుకుంటున్నారని, బంగారం కొనుగోలుపై ఆసక్తి తగ్గిందన్న వాదనలు ఉన్నాయి. కాదనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.
"మన దేశంలో ప్రజలకు బంగారంతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. చాలా మంది వారి పొదుపు సాధనాల్లో 10-15 శాతం పసిడికి కేటాయిస్తారు."
-సురేంద్ర మెహతా, ఇండియా బులియన్ & జువెలరీస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి
"బంగారం అనేది భవిష్యత్తులోనూ పెళ్లిళ్లు, ఇతర సంప్రదాయాల్లో ప్రధాన అంశంగా ఉంటుంది. కానీ... దీర్ఘకాలం తర్వాత పసిడిపై పెట్టుబడులు తగ్గొచ్చు" అన్నది కొంతమంది నిపుణుల అభిప్రాయం.