'జియో'... కొమ్ములు తిరిగిన నెట్వర్క్ ప్రొవైడర్ల వెన్నులో వణుకు పుట్టించిన డేటా సంచలనం. దేశీయ విపణిలో... ఆకాశంలో ఉన్న డేటా ధరలను నేలమీదికి రప్పించిన ఘనత జియో సొంతం. మార్కెట్లోకి జియో ప్రవేశించే ముందు 1జీబీ డేటా ధర రూ. 100 పైమాటే... అదీ నెలరోజుల వాలిడిటీతో. జియో రూ. 149కే రోజూ 1జీబీ పైనే అందించడం ప్రారంభించింది. ప్రస్తుతం అన్ని నెట్వర్కులు అదేబాటలో నడవక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇటీవల గిగా ఫైబర్ పేరుతో అతిపెద్ద డేటా బాంబ్ పేల్చింది రిలయన్స్. ఫోన్, నెట్వర్క్ బ్రాడ్‌బ్యాండ్, టీవి సేవలను ఒకే ఫైబర్ కేబుల్‌తో అందించనున్నామని ప్రకటించడమే కాదు... సెప్టెంబర్ 5న మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపింది. ముఖేశ్ అంబానీ ప్రకటన వివిధ కేబుల్ టీవీ ఆపరేటర్లు, మొబైల్ నెట్వర్క్ సంస్థల్లో ప్రకంపనలు సృష్టించాయి. తమ వినియోగదారులను రక్షించుకునేందుకు నష్ట నివారణ ప్రణాళికలను రచిస్తున్నాయి.
గిగా ఫైబర్ నుంచి పోటీని తట్టుకునేందుకు ముందు జాగ్రత్త చర్యలకు దిగింది ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయి ఉండటం... గిగా ఫైబర్ పోటీదారుగా అవతరించనున్న నేపథ్యంలో ఈ సంస్థకున్న కోటిమంది వినియోగదారులను కాపాడుకునేందుకు ఫైబర్‌ను పోలిన మరో ప్రణాళికను ట్రిపుల్ ప్లే ప్లాన్ పేరుతో అమలు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం పరిధిలో తాము బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్ సేవలు అందిస్తామని... కేబుల్ టీవీ ఆపరేటర్లు సెట్‌టాప్ బాక్స్ అందించాలన్న అవగాహనతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం ద్వారా జియో మాదిరిగానే ఒకే ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా టీవీ, ఇంటర్నెట్, మొబైల్ సేవలనూ అందించేందుకు నిర్ణయించింది. ఆఫ్టికల్ నెట్వర్క్ టెర్మినేషన్ (ఓఎన్టీ) మెషీన్ ద్వారా ఈ మూడు సేవలను అనుసంధానించనుంది.
నష్టభయంతోనే...
గిగా ఫైబర్ ద్వారా ఆర్నెల్లలో బీఎస్ఎన్ఎల్ను రిలయన్స్ దాటేస్తుందన్న అంచనాల నేపథ్యంలోనే నష్టనివారణ చర్యలకు ప్రభుత్వ రంగ సంస్థ దిగినట్లుగా వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎన్ఎల్ వైజాగ్ కేంద్రంగా ఈ నిర్ణయానికి మొగ్గు చూపిందని తెలుస్తోంది. శ్రీదేవి డిజిటల్, సాగా సిటీ సొల్యూషన్స్ సంస్థలకు వైజాగ్ వ్యాప్తంగా ఇప్పటివరకు 6 లక్షల మంది వినియోగదారులున్నారు.
వీరికే మూడు సేవలను దసరాలోగా ఆఫర్ చేయాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జియో ఫైబర్ కూడా ప్రముఖ కేబుల్ టీవి ఆపరేటర్లు హాత్వే, డెన్ నెట్వర్క్స్ తో జట్టు కట్టింది. స్మార్ట్ సెట్‌టాప్ బాక్సులకు స్థానిక మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్లకు సిగ్నళ్లను అందించే దిశగా ముందుకెళ్తోంది. దీనితో పాటుగా అంతర్జాల సౌకర్యంతో సెట్‌టాప్ బాక్సులో ఉండే జియో టీవి యాప్ ద్వారా 650 ఛానెళ్లను వీక్షించే సౌకర్యం కల్పిస్తోంది.
ధరల్లోనూ పోటీనే...
ట్రిపుల్ ప్లే ప్లాన్ ధరల్లోనూ గిగా ఫైబర్‌తో పోటీ పడుతోంది బీఎస్ఎన్ఎల్. రిలయన్స్ గిగా ప్రాథమిక ధర అయిన రూ. 700తోనే బీఎస్ఎన్ఎల్ వారి తాజా ప్లాన్ ఉండబోతుంది. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ నెల టారిఫ్ రూ. 170, బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ. 440, కేబుల్ టీవీ ఛార్జీ రూ. 200-300 మధ్య ఉంటుంది. మొత్తంగా 900 గా అవుతున్నప్పటికీ రూ. 700 కు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
వివిధ నగరాల్లోని లోకల్ కేబుల్ టీవి ఆపరేటర్లతో ఇదే విధమైన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు యోచిస్తోంది బీఎస్ఎన్ఎల్.
ఇదీ చూడండి:దేశంలో 8 కీలక రంగాల్లో వృద్ధిరేటు పతనం