రాష్ట్రాల మధ్య ధరల పెరుగుదలలో వ్యత్యాసంతో అల్ప ద్రవ్యోల్బణం కొనసాగే స్థాయిని చేరుకోవటానికి ఆర్థిక వ్యవస్థ ఇంకా దూరంలోనే ఉందని అంచనా వేసింది హెచ్డీఎఫ్సీ బ్యాంకు తాజా నివేదిక.
ద్రవ్యోల్బణం తగ్గుతోందని కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నప్పటికీ, రాష్ట్ర స్థాయి గణాంకాల పరిస్థితి మరోలా ఉందని తెలిపింది.
వచ్చే గురువారం జరగనున్న ద్రవ్య విధాన సమీక్షకు ముందు ఈ నివేదిక విడుదలవటం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ అల్ప ద్రవ్యోల్బణ స్థాయిలోకి శాశ్వతంగా మారిందా? లేదా తాత్కాలికమేనా? అన్నదే రిజర్వు బ్యాంకు ముందున్న సవాలని నివేదిక పేర్కొంది.
కేరళలో ద్రవ్యోల్బణం 5.5 శాతం, హిమాచల్ ప్రదేశ్‌లో 2 శాతంగా ఉంది. వినియోగ ధరల సూచీ ప్రకారం జాతీయ స్థాయిలో ధరల పెరుగుదల 2.6 శాతంగా ఉంది.
రాష్ట్రాల మధ్య ద్రవ్యోల్బణ గణాంకాల్లో తేడాలు ప్రాంతీయ డిమాండ్, సరఫరాల మధ్యనున్న వ్యత్యాసాలను స్పష్టంగా సూచిస్తున్నాయని నివేదిక పేర్కొంది. వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
హెచ్డీఎఫ్సీ నివేదిక ప్రకారం తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్టాలు హిమాచల్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, గోవా, హరియాణాలు.... అసోం, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్‌లు అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.
గత నెలలో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపు కొనసాగవచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. అయితే ద్రవ్యోల్బణం లక్ష్యాలను చేరకున్నప్పుడే ఇది సాధ్యమని పేర్కొన్నారు.