కరోనా దెబ్బకు 2030 వరకల్లా సంస్థలోని 50 శాతానికి పైగా ఉద్యోగులను 'ఇంటి నుంచే పని' చేయించేందుకు సిద్ధమవుతోంది ఫేస్బుక్. అలాగైతే, బోలెడు డబ్బులు మిగులుతాయి అనుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు ఎఫ్బీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్. అవకాశం వచ్చింది కదా అని.. నగరాల్లో ఖర్చు తప్పించుకుని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేస్తానంటే.. అక్కడి ఖర్చులకు తగ్గట్టే జీతం ఉంటుందన్నారు.
'మీరుండే ప్రాంతంలో జీవన వ్యయం తక్కువగా ఉంటే, లేదా శ్రామికులకు ఇచ్చే జీతాలు తక్కువగా ఉంటే వాటిని బట్టి.. మీ జీతంలోనూ మార్పులు వస్తాయి. కాబట్టి మీరు ఎక్కడ స్థిర పడాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. దానిని బట్టి మీ వేతనం ఉంటుంది. అయితే, తక్కువ వ్యయమున్న చోట ఉంటూ.. ఎక్కువ జీవన వ్యయం ఉన్న నగరాల్లో ఉంటున్నామని తప్పుడు సమాచారమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.'
-మార్క్ జుకర్బర్గ్, ఫేస్బుక్ సీఈఓ
2021 జనవరి 1వ తేదీ లోపు ఇళ్ల నుంచి ఉద్యోగాలు చేసేవారు తాము వెళ్లాలనుకున్న చోటుకు మారాలని సూచించారు జుకర్బర్గ్. వారెక్కడి నుంచి పని చేయాలనుకుంటున్నారో కచ్చితంగా చెప్పాలన్నారు. దాన్ని బట్టి జీతాలు ఖరారు చేస్తామని, ఇది సంస్థ ఆదాయ పన్ను, అకౌంట్లకు అత్యవసరమని తెలిపారు.
అంతకు తగ్గట్టే..
2018 నాటికి, ఫేస్‌బుక్‌లో సగటు ఉద్యోగి జీతం సంవత్సరానికి దాదాపు రూ. 1.82 కోట్లకు పైచిలుకు. అయితే, మెల్నో పార్క్, కాలిఫోర్నియా వంటి నగరాల్లో.. ఓ మామూలు ఇల్లు అద్దె కొనాలంటే రూ. 1.82 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అద్దెలూ అదే స్థాయిలో ఉంటాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే.. ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. అప్పుడు, జీతం కాస్తోకూస్తో మిగులుతుంది. అందుకే దాదాపు అందరు ఉద్యోగులు అటువైపే అడుగులు వేస్తున్నారు.
ఫేస్బుక్ నిర్వహించిన అంతర్గత సర్వేలో .. 45% ఉద్యోగులు అవకాశం వస్తే కచ్చితంగా మరో చోటుకు మారతామంటున్నారు. అయితే 30% మాత్రం.. వెళ్తే వెళ్తాం లేదంటే లేదనుకుంటున్నారు. 60% ఉద్యోగులు మరోచోటుకు మారాల్సివస్తే.. చిన్న పట్టణాలకు మారాలనుకుంటున్నారు. ఈ సర్వే ఆధారంగా, చోటు మారినా మీకు మిగిలేదేమీ లేదని ఉద్యోగులకు సవివరంగా తెలియజేశారు మార్క్.