టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నట్లు తన చివరి ట్వీట్లో పేర్కొన్నారు. బహుశా ఆయన.. ప్రముఖ వార్తా, చర్చా వేదిక అయిన రెడ్డిట్ అనుకూలంగా ఈ చర్య తీసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఎలాన్‌కు ట్విట్టర్లో 2 కోట్ల 9 లక్షల మంది అభిమానులు ఉన్నారు.
ఎలాన్ మస్క్ తరచుగా ట్వీట్లు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయన అనేక వివాదాల్లోనూ చిక్కుకున్నారు. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజి కమిషన్‌తోనూ విబేధాలు ఏర్పడ్డాయి. తాజాగా ఎలాన్ మస్క్ తన ట్వీట్లతో పెట్టుబడిదారులను తప్పుదారి పట్టిస్తున్నారని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజి కమిషన్ ఆరోపించింది.
"ట్విట్టర్ మంచి గురించి నాకు కచ్చితంగా తెలియదు. రెడ్డిట్ చాలా బాగుంది. అయితే నేను ఆఫ్‌లైన్‌లోకి వెళ్తున్నాను."- ఎలాన్ మస్క్, టెస్లా చీఫ్
పరువునష్టం కేసు
గతేడాది థాయిలాండ్‌లోని నీటి అడుగున ఉన్న గుహలో చిక్కుకున్న 12 మంది బాలలను నాటకీయంగా రక్షించడంలో సహకరించిన వ్యక్తి.. ఎలాన్ మస్క్‌పై పరువునష్టం కేసు వేశారు. ఎలాన్ మస్క్... అతడిని 'పెడో గాయ్' అంటూ ట్వీట్ చేయడమే ఇందుకు కారణం.
అయితే... కేవర్ను నిందించడం తన ఉద్దేశ్యం కాదని మస్క్ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో ఈ పదాన్ని సాధారణంగా వాడుతుంటారని తెలిపాడు. 'పెడో గాయ్' అంటే.. 'భయంగొలిపే వృద్ధుడు' అని అర్థం. ఈ కేసు డిసెంబర్ 2న విచారణకు రానుంది.
ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించడంపై అతని ఫాలోవర్లు విచారం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో మస్క్ అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: సెల్ఫోన్లు 30 సెకన్లు ట్రింగ్ ట్రింగ్ అనాల్సిందే..!