రిలయన్స్ రిటైల్‌తో ఫ్యూచర్ గ్రూపు కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందంపై యథాతథ స్థితి కొనసాగించాలంటూ ఫ్యూచర్ గ్రూపు, ఇతర చట్టబద్ద సంస్థలకు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపై దిల్లీ హైకోర్టు స్టే విధించింది. చట్టాలకు అనుగుణంగా ఈ ఒప్పంద ప్రక్రియ ముందుకు వెళ్లేందుకు జాతీయ కంపెనీల లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), సెబీ లాంటి చట్టబద్ద సంస్థలు నిర్ణయాలు తీసుకోకుండా ఆపలేమని కోర్టు పేర్కొంది. ఈ తీర్పును వారం రోజులు పాటు వాయిదా వేయాలంటూ అమెజాన్ చేసిన వినతిని కూడా కోర్టు తిరస్కరించింది.
ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందంపై సింగపూర్‌కు చెందిన ఏకసభ్య జడ్జి ఆర్బిట్రేషన్ ప్యానెల్ స్టేను ఆధారంగా చేసుకుని గతంలో.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది అమెజాన్. ఇందులో కిశోర్ బియానీ ఆధీనంలోని ఫ్యూచర్ రిటైల్‌ను ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్‌కు విక్రయించే ప్రక్రియ పూర్తవకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని కోరింది. దీనిని అంగీకరిస్తూ.. ఈ నెల 3న ఒప్పందంపై స్టే విధించింది దిల్లీ హైకోర్టు.
ఇదీ చూడండి:- కిశోర్ బియానీపై ఏడాది పాటు నిషేధం