దేశవ్యాప్తంగా కొత్తగా కరోనా వైరస్ బాధితుల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వ్యాపార, వర్తక సంస్థలు ముందు జాగ్రత్తల్లో తలమునకలయ్యాయి. ఆఫీసుల్లో పరిశుభ్రతకు అగ్రప్రాధాన్యం ఇవ్వటం, ఇతరత్రా అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నాయి. సమావేశాలు రద్దు చేయటం, ప్రయాణాలను వాయిదా వేయటం, ఆఫీసులకు సందర్శకులను అనుమతించకపోవటం వంటి అనేక చర్యలు చేపట్టాయి. వీటన్నింటికి మించి ఉద్యోగులు ఆఫీసుకు వచ్చే బదులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' పద్ధతిలో పనిచేయాలని పలు సంస్థలు సూచిస్తున్నాయి.
ఇప్పటికే ఐటీ రంగంలో దీన్ని పెద్దఎత్తున అమలు చేస్తుండగా మిగిలిన రంగాలకు చెందిన సంస్థలు కూడా ఇప్పుడు ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేయాలని కోరుతున్నాయి. నేరుగా ఉత్పత్తి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న సిబ్బందికి తప్పుదు కాబట్టి, వారిని ప్రతి రోజూ తనిఖీ చేసి ఎటువంటి జబ్బు లక్షణాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత ఫ్యాక్టరీల్లోకి అనుమతిస్తున్నాయి. ఇక ప్రధానంగా ఆఫీసుల్లో పనిచేసే సిబ్బందిని ఇంటి దగ్గర నుంచి పనిచేయటానికి ప్రయత్నించాలని సూచిస్తున్నాయి. పది మందిని ఎక్కడా జమ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 'కరోనా వైరస్' విస్తరణ రెండో దశకు చేరటం, పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోవటం, ఒకరి నుంచి మరొకరికి త్వరత్వరగా వైరస్ వ్యాపించే అవకాశాలు ఉండటంతో ఇటువంటి చర్యలు తప్పనిసరిగా వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి.
అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్..
తాజాగా వోల్వో కార్స్ ఇండియా తన ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రకటించింది. ఈ నెల 17 నుంచి ఉద్యోగులందరూ ఇళ్ల నుంచే పనిచేయాలని స్పష్టం చేసింది. ముఖ్యమైన సమావేశాలు ఉంటే స్కైప్ లేదా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా జరుపుకోవాలని సూచించింది. బెంగుళూరులోని వోల్వో కార్స్ ఇండియా ఆఫీసుకు ఉద్యోగులు వెళ్లి పనిచేయాలంటే తగిన అనుమతి తీసుకొని, ‘మెడికల్ స్క్రీనింగ్’ పూర్తయిన తర్వాత మాత్రమే ఆఫీసుకు రావాలని వివరించింది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజమైన టాటా మోటార్స్ తమ సిబ్బందిలో దాదాపు 3,000 మందికి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సదుపాయాన్ని ఇచ్చింది. ఉత్పత్తి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న వారిని మినహాయించి మిగిలిన సిబ్బందిలో ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఉన్న వారికి ఈ సదుపాయాన్ని కల్పించినట్లు తెలుస్తోంది. ‘కరోనా వైరస్’ వ్యాప్తిని అడ్డుకోవటానికి పలు ఇతర చర్యలు చేపట్టింది.
దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ గ్రోసరీ రిటైలింగ్ సంస్థ అయిన ‘గ్రోఫర్స్’ తన ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని, అందుకు అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ ఇ-కామర్స్ సేవల సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేస్తున్న సిబ్బందిలో చిన్న పిల్లలు ఉన్న యువ దంపతులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ మేనేజ్‌మెంట్ కలుగచేసింది. బెంగుళూరు, హైదరాబాద్, ముంబాయి, దిల్లీల్లోని తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందికి ఉబెర్, పేటిఎం, స్విగ్గీ తదితర సంస్థలు ఇటువంటి సదుపాయాన్ని కల్పించాయి. ఆన్‌లైన్ స్టాక్ బ్రోకింగ్ సేవల సంస్థ అయిన జెరోధా అయితే తమ సంస్థలో పనిచేస్తున్న వెయ్యి మందికి పైగా సిబ్బందిని ఇంటినుంచి పనిచేయాలని కోరింది.
హైదరాబాద్‌లోనూ..
హైదరాబాద్‌లో అమెజాన్, టీసీఎస్, విప్రో... తదితర అగ్రగామి సంస్థలు తమ సిబ్బందిని ఇంటి నుంచి పనిచేసే ‘ఆప్షన్’ను ఎంచుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. అవకాశం ఉంటే ఇంటి నుంచే పనిచేయండి- అని పేర్కొంటున్నాయి. స్థానికంగా ఉన్న పలు ఐటీ కంపెనీలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. దీంతో పలువురు ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేయటం కనిపిస్తోంది. మరోపక్క ఆఫీసుకు వచ్చేందుకు ప్రజా రవాణాను ఆశ్రయించే ఉద్యోగులకు కొన్ని స్థానిక కంపెనీలు ప్రైవేటు ట్యాక్సీ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ప్రధానంగా సిబ్బంది ఒక దగ్గర పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా జాగ్రత్తలు పాటిస్తున్నట్లు ఇందులో భాగంగా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు స్థానిక ఐటీ కంపెనీ ఉన్నతాదికారి ఒకరు వివరించారు. కానీ ఈ పరిస్థితి రవాణా సేవల విభాగంలో ఉన్న వారికి ఇబ్బంది కరంగా మారింది. మాకు గిరాకీ తగ్గిపోతోంది- అని ట్యాక్సీ సేవలు అందించే స్థానిక సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో తెలియటం లేదని అన్నారు.
ఇదీ చూడండి:కరోనా కారణంగా ప్రపంచ వృద్ధిలో క్షీణత