కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మరణించినట్లు ధ్రువీకరించారు పోలీసులు. ఆయన మృతదేహం మంగళూరు హొయిగీ బజార్ వద్ద నేత్రావతి నది ఒడ్డున లభించినట్లు వెల్లడించారు.
మిస్టరీ...
సోమవారం బెంగళూరు నుంచి సకలేశ్పుర్ బయలుదేరారు సిద్ధార్థ. కాసేపటి తర్వాత మంగళూరు వైపు వెళ్లాలని వాహన డ్రైవర్‌కు సూచించారు. దక్షిణ కన్నడ జిల్లా కోటెపుర ప్రాంతంలో నేత్రావది నది వంతెనపై ప్రయాణిస్తున్న సమయంలో కారు నిలిపివేయాలని ఆదేశించారు. కాసేపు ఒంటరిగా నడవాలనుకుంటున్నట్లు డ్రైవర్‌కు చెప్పారు. వంతెనపై నడుస్తూ సోమవారం సాయంత్రం 6.30 గంటల వరకు సిద్ధార్థ చరవాణిలో సంభాషించారు. కొద్దిసేపటి అనంతరం ఆయన కనిపించకుండాపోయారు. రెండు గంటలైనా సిద్ధార్థ తిరిగి రాకపోయేసరికి పోలీసులకు డ్రైవర్ ఫిర్యాదు చేశాడు.
ముమ్మర గాలింపు...
సిద్ధార్థ కోసం నేత్రావతి నదిలో నౌకదళ హెలికాప్టర్, 300 మంది గజ ఈతగాళ్ల సాయంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఈ ఉదయం లభ్యమైన మృతదేహాన్ని మంగళూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం చిక్‌మగళూరు జిల్లా ముదిగెరె తాలుకాలోని చేతనహళ్లికి తరలించనున్నారు.
ఆర్థిక ఇబ్బందులే కారణం...
సిద్ధార్థ ఆర్థిక కారణాలతోనే బలవన్మరణానికి పాల్పడ్డారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పేరిట విడుదలైన లేఖ ఇందుకు బలం చేకూర్చుతోంది.
"ప్రతి ఆర్థిక లావాదేవీకి నాదే బాధ్యత. ఎవరినీ మోసం చేయాలన్నది నా ఉద్దేశం కాదు. ఒక వ్యాపారవేత్తగా నేను విఫలం అయ్యాను. నన్ను అర్థం చేసుకుని, మన్నిస్తారని ఆశిస్తున్నా. ఈ లేఖతో పాటు నా ఆస్తుల వివరాలతో కూడిన ఓ పత్రాన్ని పొందుపరుస్తున్నాను. నా ఆస్తుల విలువ అప్పులకన్నా ఎక్కువే ఉంది. రుణదాతలు అందరికీ తిరిగి చెల్లించేందుకు వీలు ఉంటుంది" అన్నది సిద్ధార్థ పేరిట ఉన్న లేఖ సారాంశం.
ఇదీ చూడండి: 'కాఫీ డే' సిద్ధార్థకు అన్ని వేల కోట్లు అప్పులా..?