పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల రూపాయల మేర మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చుక్కెదురైంది. ఆయనను భారత్‌కు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రోన్ తెలిపారు.
భారత్ నుంచి పారిపోయాక చోక్సీ ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నారు. భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతడిని ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. ఆయనపై విచారణ పూర్తయిన వెంటనే భారత్‌కు అప్పగిస్తామని, అందుకు కాస్త సమయం పడుతుందని బ్రోన్ పేర్కొన్నారు.
చోక్సీ నిజాయతీ లేని వ్యక్తి కావడం వల్ల ఆయనతో తమ దేశానికి ఎలాంటి ఉపయోగం లేదని ఆంటిగ్వా ప్రధాని పేర్కొన్నారు. అతడిపై విచారణ జరిపేందుకు భారత్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు.
పీఎన్బీ కుంభకోణం
పీఎన్బీ కుంభకోణం కేసులో ఛోక్సీతో పాటు ఆయన అల్లుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకును రూ.13,400 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. నీరవ్ మోదీ బ్రిటన్కు పారిపోగా అక్కడి ప్రభుత్వం ఇటీవలే అరెస్టు చేసింది.
ఇదీ చూడండి: చోక్సీ పారిపోయిన ఆర్థిక నేరగాడే: ఈడీ