ఎంతో ఇష్టంగా కొన్న ఫోన్ కొన్ని సార్లు అనుకోకుండా చేతుల నుంచి జారి కింద పడిపోతుంది. దొంగతనానికి గురయ్యే అవకాశమూ ఉంది.
రిపేరు చేయించాలంటే ఒక్క స్క్రీన్ రిప్లేస్‌మెంట్ కోసమే వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాంటిది దొంగతనానికి గురైతే మళ్లీ కొత్తది కొనుక్కోవటానికి జేబుకు చిల్లు పడాల్సిందే. ఈ సమస్యలను దూరం చేయటానికి ఉద్దేశించినదే ఫోన్ బీమా.
ప్రీమియంలు ఇలా....
సాధారణంగా ఫోన్ కొనుక్కున్నప్పుడే బీమా చేయించుకునే అవకాశం ఉంది. ఫోన్ ధర ఆధారంగా ఒక సంవత్సరం ప్రీమియం నిర్ణయిస్తారు. ప్రీమియం అనేది బీమా కంపెనీని బట్టి మారుతుంది. కొన్ని కంపెనీలు ఫోన్ ధరలో 10 శాతాన్ని ప్రీమియంగా తీసుకుంటున్నాయి. స్పేర్ పార్ట్స్ ఖరీదు ఎక్కువగా ఉండే వాటికి ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
క్లెయిమ్ ఇలా...
ఫోన్ దొంగతనానికి గురైనా, కింద పడి పాడైనా బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. పొరబాటున పోగొట్టుకుంటే మాత్రం బీమా వర్తించదు.
ఫోన్ దొంగతనానికి గురైతే ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. దర్యాప్తులో ఫోన్ దొరకకపోతే అదే విషయాన్ని పోలీసులు ధ్రువీకరించాలి. ఎఫ్‌ఐఆర్ కాపీ లేదా ఫిర్యాదు లేఖతో పాటు ఆధార్, పాన్ కార్డు నకలును క్లెయిమ్ పత్రంతో జతచేసి... బీమా కార్యాలయంలో ఇవ్వాలి. ధరఖాస్తు ఇచ్చాక 15 రోజుల్లో బీమా డబ్బులు పొందవచ్చు.
ఫోన్ డ్యామేజ్ అయితే...
కింద పడటం లేదా నీళ్లలో పడటం వల్ల ఫోన్ డ్యామేజ్ అయితే రిపేరుకయ్యే ఖర్చు లో కొంత భాగం మాత్రమే పొందవచ్చు. ఇందుకోసం రిపేరుకు అయ్యే ఖర్చుపై ఎస్టిమేషన్ లెటర్ తీసుకోవాలి.
వ్యక్తిగత ధ్రువపత్రాలు, లేఖతో బీమా క్లెయిమ్ కోసం ధరఖాస్తు చేసుకోవాలి. ప్రక్రియ పూర్తయిన వారం రోజుల్లో క్లెయిమ్ అయ్యే మొత్తానికి సంబంధించిన సమాచారాన్ని బీమా సంస్థ ధరఖాస్తుదారుకు అందిస్తుంది. పైఖర్చులు ఏమైనా ఉంటే వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది.
అయితే కొన్ని బీమా సంస్థలు స్వయంగా రిపేరు చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి.
మోసాల పట్ల జాగ్రత్త...
ఫోన్లకు బీమా విషయంలో కొందరు దుకాణదారులను తప్పుదోవ పట్టిస్తుంటారని, మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
బీమా తీసుకునేటప్పుడు నిబంధనలు తప్పకుండా చదువుకోవాలని వారు సూచిస్తున్నారు. క్లెయిమ్ రేటును గమనించి మంచి కంపెనీ నుంచి బీమా తీసుకోవాలంటున్నారు.
ఇదీ చూడండి: సిరి: ఆన్లైన్లో 'వీలునామా' రాయండిలా...