ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్), మహానగర సంచార్ లిమిటెడ్(ఎమ్టీఎన్ఎల్)లను రుణాల ఊబి నుంచి బయటపడేసేందుకు అవసరమైన చర్యలకు దిగింది కేంద్ర ప్రభుత్వం. మూడు సూత్రాల పథకం ద్వారా ఆ సంస్థలకు చేయూతనివ్వాలని నిర్ణయించుకుంది.
ఈ విషయమై టెలికాం, ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్ ప్రతినిధులతో ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు ఇటీవల సమావేశమయ్యారు. 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, వాలంటరీ రిటైర్మెంట్ పథకానికి నిధుల మంజూరు, తక్షణ ఆర్థిక సహాయాలకు సూత్రప్రాయంగా అంగీకరించింది కేంద్రప్రభుత్వం.
ప్రస్తుతం టెలికాం రంగంలో నెలకొన్న తీవ్ర పోటీలో ప్రభుత్వ సంస్థలు నిలదొక్కుకునేందుకు ఈ మూడు చర్యలను చేపట్టాలని నిర్ణయించింది కేంద్రం. ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ రెండింటికీ పునరుత్తేజం కల్పించేందుకు ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు పీఎంఓ కార్యాలయ అధికారి ఒకరు వెల్లడించారు. రెండు సంస్థలకు చేయూతనిచ్చేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు.
14వేల కోట్లఅప్పులు...
మిగతా ఆపరేటర్లతో పోల్చితే అతితక్కువ అప్పులతో ఉంది బీఎస్ఎన్ఎల్. సంస్థపైరూ.14,000 వేల కోట్ల రుణభారం ఉంది. 4జీ స్పెక్ట్రమ్ అనుమతుల కోసం మరో రూ. 7వేల కోట్లుఖర్చయ్యే అవకాశం ఉంది.
ఉద్యోగుల కోసం గుజరాత్ విధానం...
అధికంగా ఉన్న ఉద్యోగులు రెండు సంస్థలకు భారంగా మారారు. బీఎస్ఎన్ఎల్లో లక్షా 76వేల మంది, ఎంటీఎన్ఎల్లో 22వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసేవారికి గుజరాత్ తరహా విధానాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాయి సంస్థలు. ఈ ప్రణాళిక కింద... పూర్తి చేసిన సేవా సంవత్సరాల 35 రోజుల జీతం, పూర్తి చేయాల్సిన సంవత్సరాలకు సంబంధించిన స్కేల్‌తో 25 రోజుల జీతాన్ని అందిస్తారు.
కాంగ్రెస్ విమర్శలు...
పెట్టుబడిదారులైన తన స్నేహితులకు లాభం చేకూర్చేందుకే ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను ప్రధాని మోదీ నిర్వీర్యం చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. సరైన రీతిలో నిధులు కేటాయించకుండా ఆ సంస్థలు మూతపడేలా కుట్ర చేశారన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధిరణ్దీప్ సుర్జేవాలా. ఈ నెల 6లోగా రూ. 11వేల కోట్లు చెల్లించి ఎమ్టీఎన్ఎల్ తన లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవాలని, లేనట్లయితే 7.7 కోట్ల వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొంటారన్నారు.
స్నేహితుల కంపెనీలను వేలకోట్ల అప్పుల నుంచి బయటపడేస్తున్న ప్రభుత్వం... బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలకు చేయూతనిచ్చేందుకు వెనకడుగు వేస్తోందని ఆరోపించారు సుర్జేవాలా. ప్రభుత్వ విధానాలు ప్రైవేటు సంస్థలకు మేలు చేకూర్చేవిగా ఉన్నాయని ఆరోపించారు.