కార్వీ స్టాక్ బ్రోకింగ్స్ లిమిటెడ్‌కు మరిన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. అన్ని విభాగాల్లో ట్రేడింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేశాయి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి, జాతీయ స్టాక్ ఎక్స్చేంజి. స్టాక్‌మార్కెట్ల నిబంధనలు ఉల్లంఘించడమే ఇందుకు కారణమని ప్రకటించాయి.
క్లయింట్ల షేర్లను కార్వీ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై సెబీ ఇటీవలే కఠిన చర్యలు తీసుకున్న నేపథ్యంలో ట్రేడింగ్ లైసెన్స్‌ను నిలిపివేశాయి బీఎస్ఈ, ఎన్ఎస్ఈ.
ఇలా మొదలు...
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ఇటీవల తనిఖీలు నిర్వహించింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్) రూ.1096 కోట్లను తన గ్రూప్ కంపెనీ కార్వీ రియాల్టీకి ఏప్రిల్ 2016 నుంచి అక్టోబరు 2019 మధ్య బదిలీ చేసిందని గుర్తించింది. క్లయింట్లకు చెందిన ఖాతాల్లో పలు అవకతవకలు జరిగినట్లు నిర్ధరించింది.
వెంటనే కార్వీపై కొరడా ఝుళిపించింది సెబీ. కొత్త క్లయింట్లను చేర్చుకోరాదని, ప్రస్తుత క్లయింట్ల ఆర్డర్లను ఎగ్జిక్యూట్ చేయరాదని ఆంక్షలు విధించింది.