ఒడుదొడుకుల నడుమ స్టాక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ముగిశాయి. నేడు త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న దిగ్గజ సంస్థలపై సానుకూల అంచనాలు లేకపోవడం ఒడుదొడుకులకు కారణంగా చెబుతున్నారు నిపుణులు. బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏలు) పెరగడం, చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల గరిష్ఠానికి చేరుకోవడం మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్లు స్టాక్ బ్రోకర్లు తెలిపారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 13 పాయింట్లు బలపడి. చివరకు 41,945 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 12,352 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 42,064 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,850 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,385 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,321 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఏజీఆర్ వివాదంపై టెల్కోలు వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చినా.. భారతీ ఎయిర్టెల్ షేరు నేడు 5.47 శాతం వృద్ధి చెందడం గమనార్హం. 30 షేర్ల ఇండెక్స్‌లో ఈ షేరు నేడు అగ్రస్థానంలో నిలవడం మరో విశేషం.
అయితే వొడాఫోన్ ఐడియా షేరు మాత్రం నేడు 25.21 శాతం క్షీణించి.. రూ.4.51 వద్దకు చేరింది.
రిలయన్స్ 2.79 శాతం, సన్‌ఫార్మా 1.24 శాతం, హెచ్‌సీఎల్‌టెక్ 0.91 శాతం, మారుతీ 0.80 శాతం లాభాలను నమోదు చేశాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్ 2.46 శాతం, ఎస్బీఐ 1.62 శాతం, హెచ్డీఎఫ్సీ 1.14 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.14 శాతం, ఎల్&టీ 1.10 శాతం నష్టాన్ని మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు ఇలా..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లైన..షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ సూచీలు నేడు లాభాలతో ముగిశాయి.
రూపాయి, ముడిచమురు
రూపాయి నేడు 15 పైసలు క్షీణిచింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 71.08 వద్దకు చేరింది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ నేడు 0.36 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 64.86 డాలర్లకు చేరింది.
ఇదీ చూడండి:అమెజాన్ ఆఫర్: ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు