భారతదేశంలో ఆటోమొబైల్ అమ్మకాలు ఆగస్టు నెలలో ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. వరుసగా పదో నెలలోనూ దేశీయ ప్రయాణికుల వాహనాలు, ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో క్షీణత నమోదైంది. ఇది తీవ్రమౌతోన్న వాహన రంగ సంక్షోభాన్ని తెలియచెబుతోందని భారతీయ వాహన తయారీదారుల సొసైటీ-సియామ్ పేర్కొంది.
సియామ్ 1997-98లో టోకు వాహన అమ్మకాల డేటాను రికార్డు చేయడం ప్రారంభించినప్పటి నుంచి... దేశంలో వాహనాల విక్రయాలు ఇంతగా పడిపోవడం ఇదే మొదటిసారి.
2018 ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో దేశీయ ప్రయాణ వాహన విక్రయాలు 31.57శాతం క్షీణించాయి. గత ఏడాది ఆగస్టులో 2లక్షల 87వేల 198 ప్రయాణ వాహన విక్రయాలు జరగగా ఈ ఏడాది ఆగస్టులో లక్షా 96వేల 524 మాత్రమే అమ్ముడయ్యాయి. దేశీయ కార్ల అమ్మకాలు గత ఏడాది ఆగస్టులో లక్షా 96వేల 847 జరగగా అవి ఈ ఏడాది ఆగస్టులో 41శాతం క్షీణించి లక్షా 15వేల 957 మాత్రమే అమ్ముడయ్యాయి.
మోటారు సైకిళ్ల విక్రయాలు గత ఏడాది ఆగస్టులో 12లక్షల 7వేల 5 ఉండగా..ఈ ఏడాది ఆగస్టులో 22.33శాతం క్షీణించి 9లక్షల 37వేల 486 వాహన విక్రయాలు మాత్రమే జరిగాయి. గత ఏడాది ఆగస్టులో ద్విచక్ర వాహనాలు 19 లక్షల 47వేల 304 అమ్ముడు కాగా... ఈ ఏడాది ఆగస్టులో 22.24 క్షీణత నమోదై వాటి విక్రయాల సంఖ్య 15లక్షల 14వేల 196కు పడిపోయింది. వాణిజ్య వాహనాల విక్రయాల్లో 38.71 క్షీణత నమోదై 51వేల 897 మాత్రమే అమ్ముడయ్యాయి.
మొత్తంగా చూసుకుంటే కేటగిరీలకు అతీతంగా అన్ని రకాల వాహన అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. గత ఏడాది ఆగస్టులో 23లక్షల 82వేల 436 వాహనాలు అమ్ముడు కాగా..ఈ ఏడాది ఆగస్టులో 23.55 క్షీణత నమోదై..18లక్షల 21వేల 490 వాహన విక్రయాలు మాత్రమే జరిగాయి.
బాబోయ్ జీఎస్టీ తగ్గించండి!
వాహన రంగం కుదేలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉద్దీపనలు అందించాలని వాహన తయారీదారులు కోరుతున్నారు. జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై సెప్టెంబర్ 20న గోవాలో సమావేశమయ్యే జీఎస్టీ మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇదీ చూడండి:దేశంలో ఈ ప్రాంతాలు చాలా 'ఖరీదు' గురూ