ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ అరుదైన ఘనత సాధించింది. బుధవారం కంపెనీ మార్కెట్ విలువ తొలిసారిగా 2 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఘనత సాధించిన తొలి అమెరికా సంస్థ రికార్డు సృష్టించింది.
కరోనా ఉద్ధృతిలోనూ యాపిల్ షేర్ విలువ పెరగడం గమనార్హం. బుధవారం నాటి ట్రేడింగ్‌లో యాపిల్ షేరు ధర 1.4 శాతం పెరగడం వల్ల కంపెనీ విలువ రెండు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది.
రెండేళ్లలోనే..
అంతర్జాతీయంగా లాక్‌డౌన్ అమలుతో ఉత్పత్తుల తయారీ మందగించినప్పటికీ 2020లో యాపిల్ షేర్ విలువ 60 శాతం పెరిగింది. ఒక ట్రిలియన్ డాలర్‌కు చేరువైన రెండేళ్లలోనే యాపిల్ ఈ ఘనత సాధించడం విశేషం. సంస్థ ప్రారంభమైన 42 ఏళ్ల తర్వాత 2018 ఆగస్టులో యాపిల్ ఒక ట్రిలియన్ డాలర్ మైలురాయిని చేరుకుంది.
జులై త్రైమాసిక ఫలితాల్లో యాపిల్ షేర్ల విలువ ఒక్కసారిగా పెరగడం వల్ల ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన కంపెనీగా ఉన్న సౌదీ ఆరామ్‌కోను తోసిరాజని యాపిల్ ముందంజలో నిలిచింది. వినియోగదారుల సేవలపై ఆ సంస్థ దృష్టి సారించడం.. పెట్టుబడిదారుల నమ్మకాన్ని చూరగొంది.
ఇతర దిగ్గజ సంస్థలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ ఒక ట్రిలియన్ డాలర్లు దాటింది.
ఇదీ చూడండి: చైనా యాపిల్ స్టోర్ నుంచి 47వేల అప్లికేషన్లు డిలీట్