ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లు పండుగ సీజన్లో అమ్మకాల్లో తారాజువ్వల్లా దూసుకెళ్లాయి. ఫ్లిప్కార్ట్- బిగ్ బిలియన్ డేస్, అమెజాన్- గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఆఫర్లు సెప్టెంబర్ 29 నుంచి ఈనెల 4వరకు కొనసాగాయి. ఈ ఆరు రోజుల మొత్తం మార్కెట్ విలువలో 90 శాతంతో రూ.19,000 కోట్ల అమ్మకాలు ఈ రెండు సంస్థలు చేపట్టినట్లు బెంగళూరుకు చెందిన పరిశోధన సంస్థ రెడ్సీర్ కన్సల్టెన్సీ ప్రకటించింది.
63 శాతంతో ఫ్లిప్కార్ట్ టాప్..
విక్రయాల సీజన్లో 60-62 శాతం స్థూల జీఎమ్వీ షేర్ వాటాతో ఫ్లిప్కార్ట్ పండుగ అమ్మకాలకు నాయకత్వం వహించినట్లు నివేదిక పేర్కొంది. అనుబంధ గ్రూపులు మింత్రా, జబాంగ్లను కలిపితే అది దాదాపు 63 శాతం వాటా ఉంటుందని లెక్కగట్టింది. అధికంగా మొబైల్ ఫోన్ల అమ్మకాలతో ఫ్లిప్కార్ట్ అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొంది. జీఎంవీ వాటాలో అమెజాన్ 22 శాతం వృద్ధి నమోదుచేసినట్లు తెలిపింది.
రెడ్సీర్ నివేదిక ప్రకారం ఇయర్ ఆన్ ఇయర్ (వైఓవై) వృద్ధి పండుగ సీజన్లో 30 శాతంగా ఉంది.
రికార్డు స్థాయిలో..
ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగినట్లు ప్రకటించాయి. ప్రత్యేక సీజన్లో టైర్-2, టైర్-3 నగరాల్లో కొత్త కస్టమర్లను ఆకర్షించటంలో సఫలమైనట్లు పేర్కొన్నాయి. ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్లు, ఫ్యాషన్, భారీ గృహోపకరణాలు వంటివి విక్రయాల్లో తొలి స్థానంలో ఉన్నాయని తెలిపాయి ఈ-కామర్స్ సంస్థలు.
నమ్మదగినట్లు లేదు..
జీఎంవీ వాటాలో అమెజాన్ 22 శాతం నమోదైనట్లు పేర్కొన్న రెడ్సీర్ నివేదికను తప్పుపట్టారు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు. నమ్మలేని విధంగా ఉన్న నివేదికలపై తాము మాట్లడమని పేర్కొన్నారు. పండుగ సీజన్లో అమెజాన్ వినియోగదారుల లావాదేవీల్లో అత్యధికంగా 51శాతం, ఆర్డర్ వాటా 42 శాతం, దేశంలోని అన్ని మార్కెట్లలో 45 శాతం వాటాతో నిలిచినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: పసిడి ధరలు మళ్లీ పరుగు- ప్రస్తుత ధర ఎంతంటే...