చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా.. తన ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. గతేడాది ప్రకటించినట్లుగానే 55వ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు. అమెరికాతో వాణిజ్యం యుద్ధం కారణంగా చైనా పరిశ్రమల్లో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో జాక్ మా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ.. ‘అలీబాబా పార్ట్‌నర్‌షిప్’ గ్రూప్‌లో సభ్యుడిగా కొనసాగనున్నారు జాక్. 36 మంది సభ్యులతో కూడిన ఈ గ్రూప్‌నకు కంపెనీ డైరెక్టర్లలో మెజార్టీ సభ్యులను నామినేట్ చేసే హక్కు ఉంటుంది.
టీచర్ నుంచి బిలియనీర్‌గా..
వృత్తిరీత్య ఇంగ్లీష్ ఉపాధ్యాయుడైన అయిన జాక్ మా.. 1999లో ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టి అలీబాబాను స్థాపించారు. తక్కువ కాలంలోనే ఈ సంస్థ వేగంగా అభివృద్ధి చెంది బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. 2013లో సీఈఓ పదవి నుంచి జాక్ మా తప్పుకున్నారు. అప్పటి నుంచి ఛైర్మన్‌గా కొనసాగిన ఆయన.. నేడు ఆ హోదా నుంచీ వైదొలిగారు. ప్రపంచ అపర సంపన్నుల్లో ఒకరైన జాక్ మా సంపద ప్రస్తుతం 41.8 బిలియన్ డాలర్లుగా ఉంది.
గత ఏడాదే రిటైర్మెంట్ ప్రకటన!
తొలుత.. 2018 సెప్టెంబర్ 10న తన 54వ పుట్టినరోజునే పదవీ విరమణ చేస్తానని వెల్లడించారు జాక్. అయితే సంస్థ అవసరాల రీత్యా మరో ఏడాది పాటు ఛైర్మన్‌గా కొనసాగాలని కంపెనీ బోర్డు సభ్యులు కోరారు. ఈ నేపథ్యంలో మరో ఏడాది ఛైర్మన్ పదవిలో ఉన్నారు జాక్ మా.
ఇదీ చూడండి: కిరాణా దుకాణాలతో జట్టుకట్టనున్న ఫ్లిప్‌కార్ట్