ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఐపీఓ బుధవారం ప్రారంభమైంది. ఒక్కో ఈక్విటీ షేర్ ఆఫర్ ధరను రూ.695 నుంచి రూ.712గా నిర్ణయించింది కంపెనీ. పబ్లిక్ ఇష్యూ ద్వారా 3,88,80,000 ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. ఇందులో ఆదిత్య బిర్లా క్యాపిటల్ 28.5 లక్షలకు పైగా షేర్లను విక్రయిస్తోంది. సన్ లైఫ్ (ఇండియా) ఏఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్ 3.6 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఆఫర్‌లో ఆదిత్య బిర్లా.. క్యాపిటల్, వాటాదారుల కోసం 19.44 లక్షల ఈక్విటీ షేర్లను రిజర్వ్ చేసింది. ఈ ఐపీఓ అక్టోబర్ 1న ముగుస్తుంది.
నిధుల సమీకరణ లక్ష్యం..
ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ రూ.2,768.25 కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఇది పూర్తిగా ఓఎఫ్ఎస్ ఇష్యూ అయినందున, ఇష్యూ నుంచి వచ్చిన ఆదాయం వాటాదారులకు వెళ్తుంది. కంపెనీ ఎలాంటి ఆదాయాన్నీ అందుకోదు.
పెట్టుబడిదారులు కనీసం 20 ఈక్విటీ షేర్లకు, (ఒక లాట్), గరిష్ఠంగా 14 లాట్లకు బిడ్ చేయొచ్చు. రిటైల్ పెట్టుబడిదారుల కనీస పెట్టుబడి సింగిల్ లాట్ కోసం రూ.14,240గాను, గరిష్ఠంగా 14 లాట్ల కోసం రూ.1,99,360 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఆఫర్‌లో సగభాగం అర్హత పొందిన సంస్థాగత కొనుగోలుదారులకు, 35 శాతం రిటైల్ పెట్టుబడిదారులకు, మిగిలిన 15 శాతం సంస్థేతర పెట్టుబడిదారులకు రిజర్వ్ చేశారు.
కంపెనీ వివరాలు..
ప్రస్తుతం ఈ సంస్థ పూర్తిగా ఇద్దరు ప్రమోటర్ల అధీనంలో ఉంది. ఆదిత్య బిర్లా క్యాపిటల్ 51 శాతం వాటాను, సన్ లైఫ్ ఏఎంసీ మిగిలిన 49 శాతాన్ని కలిగి ఉంది.
2021 జూన్ నాటికి కంపెనీ తన మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసులు, ఆఫ్‌షోర్, రియల్ ఎస్టేట్ ఆఫరింగ్స్ కింద మొత్తం రూ.2,93,642 కోట్ల ఏయూఎంను నిర్వహించింది.
ఇదీ చదవండి: పసిడి ఎక్స్ఛేంజీ ఏర్పాటుకు సెబీ బోర్డు ఆమోదం