దేశ ఆర్థిక వ్యవస్థపై.. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రంగరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ దయనీయంగా ఉందని అభిప్రాయపడ్డారాయన.
ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కష్టమే!
ప్రస్తుతం నమోదవుతున్న వృద్ధిరేటుతో.. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యం కాకపోవచ్చని రంగరాజన్ అన్నారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 2.7 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా.. రానున్న ఐదేళ్లలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏడాదికి తొమ్మిది శాతానికి పైగా వృద్ధిరేటు నమోదు కావాలని ఆయన పేర్కొన్నారు.
అహ్మదాబాద్‌లోని ఐబీఎస్-ఐసీఎఫ్ఏఐ బిజినెస్ స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన రంగరాజన్.. ఈ ఏడాది వృద్ధిరేటు ఆరు శాతంలోపే ఉంటుందని అంచనా వేశారు. వచ్చేఏడాది ఏడు శాతానికి దగ్గరగా వెళ్లొచ్చని పేర్కొన్నారు.
2025 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థని సాధించినప్పటికీ.. తలసరి ఆదాయంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంటామని రంగరాజన్ తెలిపారు.
ప్రస్తుతం తలసరి ఆదాయం 1800 డాలర్లు ఉందన్న ఆయన.. అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణించాలంటే తలసరి ఆదాయం 12వేల డాలర్లు ఉండాలన్నారు. దీన్ని అందుకోవాలంటే ఏడాదికి 9శాతం వృద్ధి రేటుతో 22ఏళ్లు పడుతుందని వివరించారు.
ఇదీ చూడండి:'రైల్వేను ప్రైవేటీకరించం.. కార్పొరేటీకరిస్తాం అంతే!'