ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పబ్లిక్ ఇష్యూ(Zomato IPO)కు మదుపర్లు బ్రహ్మరథం పట్టారు. పబ్లిక్ ఇష్యూ చివరి రోజు(శుక్రవారం) ముగిసే సమయానికి 38 రెట్లు అధికంగా ఈ ఐపీఓ సబ్స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా 71.92 కోట్ల షేర్లు విక్రయానికి పెట్టగా.. 2,751.25 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. 2020, మార్చి తర్వాత ఇదే అతిపెద్ద ఐపీఓ.
అర్హులైన సంస్థాగత మదుపర్లు(క్యూఐబీ) విభాగంలో 52 రెట్లు అధికంగా సబ్స్క్రైబ్ కాగా.. ఎన్ఐఐ విభాగంలో 19.43 కోట్ల షేర్లకు గానూ 640 కోట్ల షేర్లకు మదుపర్లు బిడ్లు వేశారు. రిటైల్ విభాగంలో 12.96 కోట్ల షేర్లకు గానూ 7.45 రెట్లు అధికంగా సబ్స్క్రైబ్ అయ్యింది.
మరోవైపు.. సంస్థ ఉద్యోగుల కోసం ప్రత్యేకించిన 65 లక్షల షేర్లలో కేవలం 62 శాతం మాత్రమే సబ్స్క్రైబ్ కావడం గమనార్హం.
యాంకర్ ఇన్వెస్టర్ల నుంచీ భారీగా బిడ్లు..
ఐపీఓకు ముందు రోజు (జూన్ 13) నాటికి యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 35 రెట్లు ఎక్కువ బిడ్లు పొందింది జొమాటో. ఒక్కో షేరుకు రూ.72-76గా ధర నిర్ణయించారు. ప్రారంభ వాటా అమ్మకం కంటే ముందు 186 యాంకర్ పెట్టుబడిదారుల నుంచి రూ.4,196 కోట్లకు పైగా వసూలు చేసినట్లు జొమాటో తెలిపింది.
తొలుత రూ.9,375 కోట్ల నిధులు సమీకరించనుంది జొమాటో. అందులో 186 యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 4,196.51 కోట్లు పొందనుంది.
2020, మార్చిలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ రూ.10,341 కోట్ల నిధుల ఇష్యూ తర్వాత.. రెండో స్థానంలో నిలిచింది జొమాటో.
ఇదీ చూడండి: జొమాటో బంపర్ ఆఫర్- బగ్ గుర్తిస్తే రూ.3లక్షల రివార్డ్