Zomato 10 Minute Food Delivery: వినియోగదారులకు 10 నిమిషాల్లోపే ఆహారాన్ని డెలివరీ చేసే 'జొమాటో ఇన్‌స్టంట్' సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. "జొమాటో సగటు డెలివరీ సమయమైన 30 నిమిషాలు, చాలా ఎక్కువని మేము భావిస్తున్నాం. ఇదే కొనసాగితే సంస్థ వెనకబడి, మరొకరు ముందుకెళ్తారు. ఈ రంగంలో మనుగడ సాధించాలంటే వినూత్నత, ముందుండి నడిపించడం చాలా అవసరం. అందుకే జొమాటో ఇన్‌స్టంట్‌ను ప్రారంభిస్తున్నాం" గోయల్ తమ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రపంచంలో ఎవ్వరూ 10 నిమిషాల్లో తాజా ఆహారాన్ని డెలివరీ చేయలేదని, ఈ విభాగంలో ఈ ఘనత సాధించడానికి చూస్తున్నామని అన్నారు.
ఇందులో భాగంగా రెస్టారెంట్ల నుంచి 20-30 వంటకాలను అందిస్తారు. ఆహార ధరలు తక్కువగానే ఉన్నప్పటికీ.. రెస్టారెంట్, డెలివరీ భాగస్వాముల ఆదాయం తగ్గదని కంపెనీ చెబుతోంది. జొమాటో ఇన్‌స్టంట్‌ను ఏప్రిల్ నుంచి గురుగ్రామ్‌లోని 4 స్టేషన్‌ల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. 8 నియమాలపై జొమాటో ఇన్‌స్టంట్‌ను నిర్మించామని గోయల్ తెలిపారు. ఇంటి భోజనం మాదిరిగా అందుబాటు ధర, అధిక నాణ్యత, ప్రపంచస్థాయి శుభ్రతా పద్ధతులు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ తగ్గించడం, సులభమైన/వేగంగా వినియోగానికి ప్యాకేజింగ్, సరఫరా వ్యవస్థ, డెలివరీ భాగస్వామి భద్రత వంటివి ఈ నియమాల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి:నిమిషానికి 9వేల ఫుడ్ ఆర్డర్లు.. 1229 బిర్యానీల డెలివరీ