Satya Nadella son died: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) మృతి చెందాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అతను కన్నుమూశాడు. పుట్టుకతోనే జైన్ నాదెళ్ల మస్తిష్క పక్షవాతంతో(సెరెబ్రల్ పాల్జీ) బాధపడుతున్నాడు. జైన్ మరణవార్తను సత్య నాదెళ్ల ఈ-మెయిల్ ద్వారా మైక్రోసాఫ్ట్ ఎక్జిక్యూటివ్ సిబ్బందికి తెలియజేశారు. మైక్రోసాఫ్ట్ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. సత్యనాదెళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని కోరింది.
Zain Nadella News
2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్యనాదెళ్ల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దివ్యాంగులకు ఉపయోగపడే ఉత్పత్తులను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. తన కుమారుడు జైన్‌ను పెంచే క్రమంలో నేర్చుకున్న విషయాలను వివరించేవారు.
Satya Nadella Son Jain Nadella
జైన్ నాదెళ్ల ది చిల్డ్రన్స్ హాస్పిటల్లోనే ఎక్కువ కాలం చికిత్స పొందాడు. సీటెల్ చిల్డ్రన్స్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ బ్రెయిన్ రీసెర్చ్‌లో భాగంగా పీడియాట్రిక్ న్యూరోసైన్సెస్‌లో జైన్ నాదెళ్ల ఎండోడ్ చైర్‌ను స్థాపించడానికి ఈ ఆస్పత్రి గతేడాదే సత్య నాదెళ్లతో చేతులు కలిపింది.
"సంగీతంలో జైన్ అభిరుచి, అతని ప్రకాశవంతమైన చిరునవ్వు, తన కుటుంబానికి, తనను ప్రేమించిన వారందరికీ జైన్ తెచ్చిన అపారమైన ఆనందం అతన్ని ఎప్పటికీ గుర్తుండేలా చేస్తుంది" అని చిల్డ్రన్స్ హాస్పిటల్ సీఈఓ జెఫ్ స్పెరింగ్ తన బోర్డుకి ఒక సందేశం పంపారు. మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్‌లతో దీన్ని షేర్ చేసుకున్నారు.
Cerebral Palsy
సెరబ్రల్ పాల్జీ అంటే ఏమిటి?
సెరబ్రల్ పాల్జీ అంటే మెదడు దెబ్బతినడం వల్ల నరాలు తీవ్రంగా ప్రభావితమై ఏర్పడే సమస్య. దీని లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. సెరబ్రల్ పాల్జీ బారిన పడిన చిన్నారుల్లో కొందరు కదల్లేరు. మరి కొందరు మాట్లాడలేరు, వినలేరు. కొందరు కంటిచూపు కోల్పోతారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు మెదడు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, ఔషధాల వల్ల దుష్ప్రభావం, నెలలు నిండకముందే బిడ్డ జన్మించడం, పుట్టుక సమయంలో తల లేదా పుర్రె దెబ్బతినడం వంటి కారణాల వల్ల చిన్నారుల ఈ వ్యాధి బారినపడతారు.