స్మార్ట్‌ఫోన్ల నుంచి టీవీలు.. స్మార్ట్‌బ్యాండ్‌ల వరకు కొత్త కొత్త ప్రోడక్ట్స్‌తో షియోమీ సంస్థ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. మిడ్ బడ్జెట్ డివైజ్ల విపణిలో అగ్రస్థానం దక్కించుకుంది.
హై-రేంజ్ మొబైల్స్, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు ఎంఐ (mi) బ్రాండ్‌తో మార్కెట్‌లోకి వస్తుంటాయి. అలానే లో కాస్ట్, బడ్జెట్ ధరల్లో వచ్చే ఉత్పత్తులను రెడ్‌మీ బ్రాండ్‌తో షియోమీ విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఇక నుంచి ఎంఐ బ్రాండ్‌గా కాకుండా 'షియోమీ' పేరుతోనే వినియోగదారుల ముందుకు వచ్చేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 'ఎంఐ' లోగో స్థానంలో కొత్త బ్రాండ్ 'షియోమీ'తో డివైజ్‌లు మార్కెట్లోకి విడుదలవుతాయని వెల్లడించింది కంపెనీ. ఇప్పటికే విడుదలైన ఎంఐ బ్రాండ్ మొబైల్స్ కూడా ఇక నుంచి షియోమీ లోగోతో వస్తాయని పేర్కొంది.
అంతరాన్ని తొలగింగించేందుకే..
షియోమీ (ఎంఐ) ఫోన్స్‌ను విపణిలో ప్రీమియం సెగ్మెంట్ బ్రాండ్‌గా పిలుస్తుంటారు. ఇటీవల భారత మార్కెట్‌లోకి విడుదలైన Mi11 అల్ట్రా, Mi11X సిరీస్ ఫోన్లు ఈ కేటగిరీలోకి వచ్చేవే. ఇక నుంచి ఇవన్నీ Xiaomi 11గా మారిపోతాయని షియోమీ వెల్లడించింది.
'ప్రపంచవ్యాప్తంగా లీడింగ్ టెక్నాలజీ బ్రాండ్ అయిన షియోమీ ప్రధాన లక్ష్యం.. బ్రాండ్‌కి ఉత్పత్తులకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించడమే. రాబోయే పండుగ సీజన్ నుంచి 'ఎంఐ' బ్రాండ్‌ను 'షియోమీ'గా రీనేమ్ చేసి ఉత్పత్తులను తీసుకువస్తున్నాం' అని షియోమీ ఇండియా మార్కెటింగ్ హెడ్ జస్కరన్ సింగ్ కపానీ పేర్కొన్నారు. ఎంఐ బ్రాండింగ్‌కు బదులు 'షియోమీ' లోగోను తీసుకురావాలని గత సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నట్లు కపానీ వివరించారు.
ఇదీ చదవండి: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్! శుక్రవారం నిర్ణయం!!