కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విధించిన లాక్డౌన్తో ఈ ఏడాది ముడిచమురు డిమాండ్ భారీగా తగ్గనున్నట్లు అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) తెలిపింది. ఇంతకు ముందెన్నడూ చూడనంతగా డిమాండ్ లేమి ఏర్పడొచ్చని అంచనా వేసింది.
బ్లాక్ ఏప్రిల్..
ఒక అంచనా ప్రకారం రోజుకు 93 లక్షల బ్యారెల్ల ముడిచమురు డిమాండ్ తగ్గొచ్చని ఐఈఏ తెలిపింది. ఇది ఒక ఏడాది వృద్ధికి సమానమని పేర్కొంది. ముఖ్యంగా ఈ ప్రస్తుత నెలలో డిమాండ్ భారీగా తగ్గొచ్చని.. చమురు మార్కెట్లకు ఇది 'బ్లాక్ ఏప్రిల్'గా అభివర్ణించింది ఐఈఏ.
సంక్షోభం-ఒప్పందం
ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే ముడిచమురు ధరలు 60 శాతం మేర పడిపోయినట్లు ఐఈఏ పేర్కొంది. తొలుత రష్యా, సౌదీ అరేబియా ధరల యుద్ధం, ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం భయాలు ఇందుకు కారణమయ్యాయి.
అయితే చమురు మద్దతు ధర కోసం ఒపెక్ దేశాలు ఇటీవల కుదుర్చుకున్న ఉత్పత్తి తగ్గింపు ఒప్పందం ఫలితాలు ఇవ్వొచ్చని ఐఈఏ ఆశాభావం వ్యక్తం చేసింది.
చమురు పతనం..
ఐఈఏ అంచనాలు వెలువడిన తర్వాత. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పతనమయ్యాయి. అమెరికా బెంచ్మార్క్ సూచీ డబ్ల్యూటీఐ 3.8 శాతం తగ్గి..18 ఏళ్ల కనిష్ఠానికి తగ్గింది. బ్యారెల్ ముడిచమురు ధర 19.34 డాలర్లు చేరింది. బ్రెంట్ సూచీ ఏకంగా 5.2 శాతం క్షీణించింది.