మౌలిక సదుపాయాల కల్పన, పేదరిక నిర్మూలన కోసం వార్షిక రుణ లక్ష్యమైన 6 బిలియన్ డాలర్లను భారత్కు అందిస్తామని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ స్పష్టం చేశారు.
"24 బిలయన్ డాలర్ల వ్యయమవుతున్న 97 ప్రాజెక్టులు.. ప్రపంచ బ్యాంకు రుణ సహాయంతో భారత్లో కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులు, సంస్కరణలకు మా తోడ్పాటు కొనసాగుతుంది. ఇందు కోసం ఏటా 5 నుంచి 6 బిలియన్ డాలర్ల రుణాన్ని భారత్కు అందిస్తాం."- డేవిడ్ మాల్పాస్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు
దూసుకుపోతోంది..
సులభ వాణిజ్య విధానం ర్యాంకింగ్స్లో భారత్ దూసుకుపోతోందని డేవిడ్ మాల్పాస్ పేర్కొన్నారు. గత మూడేళ్లలో టాప్ 10 దేశాల్లో ఒకటిగా నిలిచిందని, ర్యాంకింగ్స్లో 140 నుంచి 63వ స్థానానికి వేగంగా చేరుకుందని ఆయన అన్నారు. 'మేక్ ఇన్ ఇండియా', విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఇతర సంస్కరణల వల్ల భారత్ ఈ ఘనత సాధించిందని అభిప్రాయపడ్డారు మాల్పాస్.
వీటిలో వెనుకబడింది..
భారత్... కాంట్రాక్టు ఒప్పందాలను అమలుచేయడం (163వ స్థానం), ఆస్తుల రిజిస్ట్రేషన్ (154వ స్థానం) విషయాల్లో ఇంకా వెనుకబడిందన్నారు డేవిడ్ మాల్పాస్.
వాణిజ్య న్యాయస్థానాలు..
వాణిజ్య వివాదాలను సత్వరం పరిష్కరించుకోవడం కోసం జిల్లా స్థాయిలో వాణిజ్య న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని డేవిడ్ సూచించారు. అప్పుడే త్వరితగతిన వివాదాలు పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు.
మోదీ లక్ష్యం బాగుంది..
2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం ఆర్థిక రంగ అభివృద్ధికి తోడ్పడుతుందని డేవిడ్ అన్నారు.
ప్రధానితో భేటీ
ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో వేర్వేరుగా సమావేశమయ్యారు డేవిడ్ మాల్పాస్. భారత్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక రంగ బలోపేతం, ప్రాంతీయ అనుసంధానం, సివిల్ సర్వీసెస్ సంస్కరణలు సహా పలు అంశాలపై చర్చించారు.
ఇదీ చూడండి: ప్రయాణికుడిని కాపాడిన రైల్వే పోలీస్